- నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు, చెల్లె, బావ
- పెద్దపల్లి జిల్లాలో దారుణం.. నిందితుల అరెస్టు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి, డబ్బుల కోసం సొంత అన్నను సజీవదహనం చేశారు. అన్న నిద్రిస్తుండగా బావతో కలిసి తమ్ముడు, చెల్లె పెట్రోల్ పోసి నిప్పంటించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గాలిపెల్లి బక్కయ్య, వినోద దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు అశోక్ (36), నరేశ్, బిడ్డ పుష్పలత ఉన్నారు. పుష్పలతను సుల్తానాబాద్ మండలం శుగ్లాంపల్లికి చెందిన అనిల్ కు ఇచ్చి వివాహం చేశారు. అశోక్, నరేష్ కు ఇంకా పెళ్లి కాలేదు. నరేష్ మెకానిక్ గా పని చేస్తుండగా, అశోక్ రెండేండ్ల కింద దుబాయ్ వెళ్లాడు. అక్కడ సంపాదించిన డబ్బులను తమ్ముడికి పంపించేవాడు. ఈ క్రమంలో అశోక్నెల కింద ఇంటికి తిరిగొచ్చాడు. తాను దుబాయ్‌లో ఉండగా పంపిన రూ.30 లక్షల గురించి అడిగాడు.
ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని నరేశ్.. అన్నతో గొడవకు దిగాడు. అతనికి చెల్లెలు పుష్పలత, బావ అనిల్ కూడా సపోర్టుగా నిలిచారు. రూ.30 లక్షలతో పాటు ఆస్తి పంపకాల గురించి కూడా కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు బక్కయ్య, వినోద అనారోగ్యంతో మంచం పట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.
చంపుతామని బెదిరించి..
నరేశ్, పుష్పలత, అనిల్ ఒక్కటై.. అశోక్‌ను చంపుతామని బెదిరించారు. దీంతో అశోక్ పది రోజుల కింద ధర్మారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కుటుంబసభ్యులను పిలిపించిన ఎస్సై సత్యనారాయణ.. వాళ్లకు కౌన్సెలింగ్ఇచ్చి పంపించారు. అశోక్ అప్పటి నుంచి తన ఇంట్లో పడుకోవడం లేదు. బయట స్నేహితుల ఇండ్లలోనే నిద్రిస్తున్నాడు. ఇటీవల గొడవలు కొంచెం తగ్గడంతో మంగళవారం రాత్రే తన ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఈ అవకాశం కోసమే చూస్తున్న నరేశ్, పుష్పలత, అనిల్.. అశోక్‌ను చంపేందుకు అప్పటికే ప్లాన్ వేసుకున్నారు. అర్ధరాత్రి అతడు పడుకున్న రూమ్ డోర్ లాక్ చేశారు. కిటికీలో నుంచి అశోక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు అంటుకుని ఎటూ పోలేని స్థితిలో అతడు ఆ రూమ్ లోనే సజీవదహనమయ్యాడు. పెద్దపల్లి ఏసీపీ మహే శ్, సీఐ అనిల్ కుమార్, ఎస్సై సత్యనారాయణ స్పాట్‌కు వచ్చి పరిశీలించారు. అశోక్‌కు వరుసకు అన్న అయిన కొక్కుల రామనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు నరేశ్, పుష్పలత, అనిల్‌ను అరెస్టు చేశారు.
