సంక్రాంతి ప్రయాణాలు షురూ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ

సంక్రాంతి ప్రయాణాలు షురూ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ

హైదరాబాద్, వెలుగు:  సంక్రాంతి పండుగకు సిటీ జనాలు సొంతూరి బాట పట్టారు. నేటి నుంచి ఈ నెల17 వరకు స్కూళ్లకు, ఈ నెల13 నుంచి 16 వరకు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో  కుటుంబ సమేతంగా తరలివెళ్తుండగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. జేబీఎస్​, ఎంజీబీఎస్​, ఉప్పల్, ఎల్​బీనగర్,​ ఆరాంఘర్ తదితర బస్​స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వారు రైల్వే స్టేషన్ల వద్ద బారులు తీరారు. మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలు ఎక్కువ శాతం ప్రయాణిస్తుండటంతో బస్సుల్లో పుల్ రష్ ఉంటుంది. మరోవైపు ప్రైవేట్​ వాహనాలు డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. సొంత వాహనాల్లో తరలివెళ్లే వారితో టోల్​గేట్ల వద్ద కూడా బారులు తీరి ఉంటున్నాయి. 

చౌరస్తాల్లో.. బస్​స్టేషన్లలో రద్దీ 

పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ఆర్టీసీ అన్నిఏర్పాట్లు చేసింది. సిటీ నుంచి ప్రత్యేకంగా 700 బస్సులను నడుపుతోంది. సిటీ బస్సులను సైతం స్పెషల్​గా జిల్లాలకు వేశారు. తమ సొంతూళ్లకు వెళ్తుండగా.. ప్రధాన చౌరస్తాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. మరో రెండు రోజుల్లో రద్దీ ఇంకా పెరగనుంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎల్​బీనగర్​లోని విజయవాడ బస్టాప్ వద్ద  కలగకుండా షామియానాలు, కుర్చీలు, పబ్లిక్​అడ్రస్ ​సిస్టం, మొబైల్​టాయిలెట్స్​ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల భద్రతా దృష్ట్యా.. రద్దీ ఎక్కువగా ఉండే ఆరాంఘర్​లో 6​, ఉప్పల్​లో16 ​, ఎల్​బీనగర్​లో 10  సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని బస్ భవన్ ​లోని కమాండ్​ కంట్రోల్ ​సెంటర్​కు లింక్ చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. 

స్పెషల్ రైళ్లు..  

రాష్ట్రంతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం సౌత్​ సెంట్రల్​ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నెల 7 నుంచే ఈ స్పెషల్ సర్వీసులను ప్రారంభించింది. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఈ నెల 27 వరకు 38 స్పెషల్​ సర్వీసులను నడుపనుంది.