17 నుంచి రోడ్కెక్కనున్నబస్సులు?

17 నుంచి రోడ్కెక్కనున్నబస్సులు?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దాదాపు 2 నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఈ నెల 17 నుంచి రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సులు నడపడంపై శుక్రవారం జరగనున్న సమావేశంలో సీఎం కేసీఆర్‌‌‌‌ నిర్ణయం తీసుకునే చాన్స్‌‌‌‌ ఉందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. హైదరాబాద్‌‌‌‌, కంటైన్‌‌‌‌మెంట్‌‌‌‌ జోన్లు మినహా అన్ని జిల్లాల్లో, జిల్లాల నుంచి హైదరాబాద్‌‌‌‌ శివారు ప్రాంతాల వరకు బస్సులు నడవనున్నాయి. బస్సులు నడిపేందుకు డిపోల్లో అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని బస్సుల ఇంజన్ కండిషన్స్ చెక్‌‌‌‌ చేసి.. డ్యూటీలకు సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో మార్చి 22 నుంచి రాష్ట్రంలో బస్సులు నడవడం లేదు. దీంతో సంస్థ రూ.750 కోట్ల వరకు ఆదాయం కోల్పోయింది.

బస్సుల్లో జాగ్రత్తలు ఇవీ..

బస్సుల్లో ప్రయాణం సందర్భంగా కరోనా వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్సులను శానిటైజ్‌‌‌‌ చేశారు. బస్సు ఎక్కే ప్రతి ప్యాసింజర్‌‌‌‌కు థర్మల్‌‌‌‌ స్క్రీనింగ్‌‌‌‌ చేయనున్నారు. మాస్క్‌‌‌‌ కట్టుకుంటేనే బస్సులోకి అనుమతిస్తారు. బస్సు ఎక్కకముందే కండక్టర్‌‌‌‌ వద్ద టికెట్లు తీసుకోవాలి. ప్రధాన బస్టాప్‌‌‌‌లలో టికెట్‌‌‌‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. స్టాప్‌‌‌‌ల వద్ద జనం గుమిగూడకుండా ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తారు. ఫిజికల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ ఉండేలా బస్సుల్లో సీట్లకు నంబర్స్‌‌‌‌ వేస్తున్నారు. ఆయా నంబర్స్‌‌‌‌ ఉన్న చోటే ప్యాసింజర్‌‌‌‌ కూర్చోవాల్సి ఉంటుంది. సీట్లలో క్రాస్‌‌‌‌ మార్క్‌‌‌‌ కూడా వేస్తున్నారు. అంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవద్దని సూచిక.

50 శాతం ఆక్యుపెన్సీతోనే..

బస్సులను 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడపాలనే నిబంధన ఉండటంతో దానికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లె వెలుగు బస్సులో 56 సీట్లు ఉండగా 25 నుంచి 30 మందిని, ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లో 49 సీట్లుండగా 25 మంది వరకు, సూపర్‌‌‌‌ లగ్జరీలో 39 సీట్లుండగా 17 మందిని మాత్రమే ఎక్కించుకోనున్నారు. రెండు సీట్లుంటే ఒకరు, మూడు సీట్లుంటే ఇద్దరు చొప్పున కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో సంస్థకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో చార్జీలు పెంచే ఆలోచన కూడా చేస్తున్నారు. కొన్ని రోజుల వరకు 50 శాతం బస్సులనే నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది.

మే 18 తర్వాత విమానాలు