
బషీర్బాగ్, వెలుగు: బిజినెస్ ఫ్రాడ్ కేసులో ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది నగరానికి చెందిన 32 ఏళ్ల బిజినెస్ మెన్ కు సైబర్ చీటర్స్ ఫోన్ కాల్ చేశారు. బాధితుడి ప్రొడక్ట్స్ కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్డర్స్ తీసుకొస్తామని నమ్మించారు. దీనిని నమ్మిన బాధితుడు రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించి, స్కామర్లకు క్లయింట్ గా చేరాడు. దీంతో బాధితుడికి స్కామర్లు ఫేక్ మెయిల్స్ పంపించి , అతని ప్రొడక్టులకు అంతర్జాతీయ స్థాయిలో ఆర్డర్స్ వచ్చాయని, వాటికి చార్జీల పేరిట మొత్తం రూ.9,50,531 లను వసూలు చేశారు.
అనంతరం బాధితుడి కాల్స్ ను బ్లాక్ చేశారు. ఈ ఘటనపై బాధితుడితో ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మోసగించిన స్కామర్లను ఢిల్లీలో గుర్తించారు. ఢిల్లీలో ఓ కంపెనీ సీఈవో అయిన అమర్నాథ్ సింగ్ (39), మార్కెటింగ్ హెడ్ అయిన రణవీర్ సింగ్ (46) ను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై దేశవ్యాప్తంగా 17, తెలంగాణలో ఒక కేసు నమోదు అయినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్స్, కంపెనీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సీజ్ చేసి హైదరాబాద్ తరలించారు. వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.