స్క్రీన్‌షేరింగ్ యాప్‌లతో బడా మోసం.. రూ.50వేలు మాయం

స్క్రీన్‌షేరింగ్ యాప్‌లతో బడా మోసం.. రూ.50వేలు మాయం

దేశంలో ఆన్‌లైన్ స్కామ్‌ల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీని వల్ల ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును క్షణాల్లో కోల్పోతున్నారు. అందుకు అపరిచితులను విశ్వసించకుండా ఇటువంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్కామర్‌లు ఇప్పుడు మరో కొత్త దారిలో డబ్బులను కొట్టేస్తున్నారు. కొంతమందిని వారి ఫోన్‌లు లేదా ల్యాప్‌టాప్‌లలో స్క్రీన్‌షేరింగ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయమని అడుగుతున్నారు. తద్వారా నిమిషాల వ్యవధిలో వారి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

ఒక వ్యాపారవేత్త తన ఫోన్ పే(PhonePe) ఖాతాను ఆపరేట్ చేయడానికి సహాయం కోరిన తర్వాత స్క్రీన్ షేరింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడంతో రూ. 50వేల కంటే ఎక్కువ నగదును నష్టపోయాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ఒక వ్యాపారవేత్త తన ఫోన్‌పే యాప్‌ను ఆపరేట్ చేయడంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. అంతకుముందే అతని ఖాతాకు యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లతో లింక్ చేయబడి ఉంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి సహాయం కోసం గూగుల్ (Google)ని ఆశ్రయించాడు. సమస్యను పరిష్కరించడానికి మార్గాలను వెతకడం ప్రారంభించాడు. అతను 08918924399 అనే నంబర్‌ని చూసి జూలై 9 ఉదయం కాల్ చేశాడు. అవతలి వైపు ఉన్న వ్యక్తి ఫోన్ తీయగానే మొదట కాల్ కట్ చేసి, వ్యాపారవేత్తకు మరొక నంబర్ 01725644238 నుంచి కాల్ చేశాడు.  

బాధితుడు ఫోన్‌పే యాప్‌తో తనకున్న సమస్య గురించి అపరిచిత వ్యక్తికి చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి.. అతని రెండు బ్యాంక్ ఖాతాల గురించి అడిగాడు. బాధితుడు వివరాలను అందించిన తర్వాత, స్క్రీన్ షేరింగ్ యాప్ అయిన రస్ట్ డెస్క్‌ని ఇన్‌స్టాల్ చేయమని బాధితుడిని ఆ వ్యక్తి కోరాడు. వ్యాపారవేత్త అలా ఆ అపరిచితుడి సలహా మేరకు యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. స్కామర్ అప్పుడు స్క్రీన్‌షేర్ యాప్ ద్వారా ఫోన్‌పే యాప్‌పై నిఘా ఉంచి.. బాధితుడిని యాప్ ఓపెన్ చేయమని కోరాడు. ఉదయం 11 గంటలకు అతని రెండు క్రెడిట్ కార్డ్‌ల ముందు, వెనుక భాగాన్ని స్కాన్ చేశాడు. ఆ తర్వాత, బాధితుడి బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాకు చెందిన క్రెడిట్ కార్డ్‌ నుంచి రూ.29 వేల 998, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ నుంచి రూ.27వేల 803 కట్ అయ్యాయి. దీనిపై జూలై 25న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు బాధితుడు ఫిర్యాదు చేయగా, బెల్తంగడి పోలీసులు జూలై 31న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఇలాంటి మోసాల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి..

మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఏ అపరిచితుడిని నమ్మకపోవడమే ఇటువంటి మోసాల నుంచి సురక్షితంగా ఉండటానికి ఉత్తమ మార్గం. కంపెనీ అధికారిక ప్రతినిధులను ఇమెయిల్ లేదా కంపెనీ అధికారిక నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌లో సహాయం కోసం వెతకడానికి బదులుగా, మీరు అనుసరించాల్సిన ప్రాసెస్ గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే కంపెనీ నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అలాగే, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు మిమ్మల్ని ఏ యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని గానీ లేదా మీ ఫోన్ స్క్రీన్‌ని వారితో షేర్ చేయమని అడగరని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు వాట్సాప్, టెలిగ్రామ్‌ల ద్వారా మోసగాళ్లు ప్రజలను ఆశ్రయిస్తున్న ఉదంతాలు ఇప్పటికే దేశంలో అనేకం జరిగాయి. ఒకవేళ మీకు తెలియని నంబర్ నుండి మెసేజ్ వస్తే, ఆ నంబర్ ను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయడం ఉత్తమం.