ములుగు, వెలుగు : ములుగు జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి 9 వరకు ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం ప్రాంతాల్లో తొలిసారిగా సీతాకోక చిలుకలు, చిమ్మటల సర్వే ప్రారంభించినట్టు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. గురువారం అటవీ, వైల్డ్ లైఫ్అధికారులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేలో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థలు నాలెడ్జ్ భాగస్వాములుగా ఉన్నాయన్నారు.
బెంగళూరు, కేరళ, పాట్నా, రాయపూర్, అమరావతి, నాసిక్, పుణె, వరంగల్, చత్తీస్ ఘడ్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి 33 మంది స్వచ్ఛంద సేవకులు సర్వేలో పాల్గొంటున్నారన్నారు. అటవీ శాఖ తరఫున ఏటూరునాగారం అటవీ డివిజనల్ అధికారి ఎస్.రమేశ్, ప్రధాన శాస్త్రవేత్త చిత్ర శంకర్, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు ఇంద్రం నాగేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి చెల్పూర్ శ్యామ్ సుందర్, పర్యావరణవేత్త రవిబాబు పిట్టల, అటవీ అధికారుల, సిబ్బంది పాల్గొన్నారన్నారు.
ప్రధానంగా ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలో కొత్త సీతాకోక చిలుకల జాతులను గుర్తించడం, జీవ వైవిధ్య పరిరక్షణకు సర్వే దోహదం చేస్తుందన్నారు. ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపు, అడవుల ప్రాధాన్యంపై చైతన్యం కల్పించడం, భవిష్యత్ తరాలకు పచ్చని, సుస్థిరమైన జీవన విధానాన్ని అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రేంజ్అధికారి శంకర్, ఎఫ్ఎస్వోలు, ఎఫ్బీవోలు ఉన్నారు.
