సాదా బైనామాకు కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే చాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

సాదా బైనామాకు కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే చాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  •     కౌన్సిల్​లో  మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి క్లారిటీ
  •     త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. మంగళవారం కౌన్సిల్​లో సీపీఐ సభ్యుడు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి వివరాలు వెల్లడించారు. గత ప్రభుత్వం సాదాబైనామాల దరఖాస్తులను స్వీకరించినప్పటికీ.. 2020 ఆర్ఓఆర్ చట్టంలో వాటి పరిష్కారానికి స్పష్టమైన మార్గం చూపలేదని తెలిపారు. 

భూభారతి చట్టంలో ఈసమస్యకు పరిష్కారం సూచించినప్పటికీ.. కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకునేలా జీవో 76ను జారీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని, ఈ నిర్ణయంతో వాటికి పరిష్కారం లభించనుందని వివరించారు. 

‘ఆధార్’ తరహాలో ‘భూధార్’ అమలు

రాష్ట్రంలో నక్షాలులేని 413 గ్రామాల సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ఐదు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించి, ప్రతి సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆధార్ నెంబర్ మాదిరిగా ‘భూధార్’ కేటాయించినట్లు చెప్పారు. త్వరలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 70 గ్రామాల్లో భూ సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. దశలవారీగా సర్వే పూర్తి చేసి భూధార్ అమలు ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు.

ధరణి లోపాలపై చర్యలు..

ధరణి పోర్టల్ లోపాలను ఆసరాగా చేసుకుని  మీ-సేవా నిర్వాహకులతో కలిసి కొందరు రూ.3.99 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఆ నిధులు రికవరీ చేస్తామని, ఇందులో  అధికారుల పాత్ర ఉన్నా  ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గత ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అమలు చేసిందని విమర్శించారు. 

భూ భారతి పోర్టల్ ద్వారా  వ్యవస్థను సరళీకరించామని తెలిపారు. ధరణిలో ఉన్న 40 మాడ్యూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భూ భారతిలో 6కు కుదించామని చెప్పారు. దశలవారీగా మార్పులు చేస్తూ..  ఈ ఏడాది ఏప్రిల్ చివరికల్లా పూర్తి స్థాయిలో భూ భారతి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.