ఐదేళ్లుగా ప్రతి సెప్టెంబరులో కుండపోత వానలు

ఐదేళ్లుగా ప్రతి సెప్టెంబరులో కుండపోత వానలు

హైదరాబాద్ లో పలుచోట్ల అకస్మాత్తుగా వానలు దంచికొడుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. ఒక చోట వాన పడితే.. మరోచోట ఎండ కొడుతోంది. హైదరాబాద్ ఒక్కటే కాదు.. రాష్ట్రంలోని చాలా పట్టణాలు వరదల వలయంలో చిక్కుకుంటున్న వైనాలను మనం చూస్తున్నాం. ఎందుకిలా జరుగుతోంది ?  అనే దానిపై ప్రముఖ పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు ‘వీ6’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘ గత ఐదేళ్లలో (2017 నుంచి) రుతువుల్లో భారీ మార్పు కనిపిస్తోంది. ఏటా సెప్టెంబరులో కుండపోత వానలు చుట్టుముడుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ తరహా వాతావరణ పరిస్థితులు అలుముకుంటున్నాయి. సాధారణంగానైతే సెప్టెంబరు నెలలో రుతు పవనాలు వెనక్కి వెళ్లిపోతాయి. అక్టోబరును మినీ సమ్మర్ అంటాం. ఆ నెలలో ఉష్ణోగ్రత్తలు కొంతమేర పెరుగుతుంటాయి. నవంబరులో మళ్లీ వాతావరణం చల్లబడుతుంటుంది. అనూహ్యంగా గత ఐదారేళ్లుగా సెప్టెంబరులో కుండపోత వానలు పెరిగాయి. ఈవిధంగా మారిపోయిన ట్రెండ్ ను మనం పెద్దగా పట్టించుకోవడం లేదు. వాతావరణ మార్పులకు అనుగుణంగా విపత్తు నిర్వహణ యంత్రాంగాన్ని, వాతావరణ విభాగాల్ని, ప్రజారోగ్య వ్యవస్థల్ని సమాయత్తం చేసుకోవడం లేదు. రుతుపవన వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఒక క్యాలెండర్ ను సిద్ధం చేసుకోవాలి. అది జరగడం లేదు.

ఫలితంగా అకస్మాత్తుగా కుండపోత వానలు కురిసి..  హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు నగరాలు వరద గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం వాటర్ క్యాచ్ మెంట్ ఏరియాలు కనుమరుగు కావడమే. ల్యాండ్ రూల్స్ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉల్లంఘిస్తున్నారు. వాతావరణ విభాగం, హెచ్ఎండీఏతో పాటు కనీసం ఏదైనా యూనివర్సిటీ భాగస్వామ్యం కూడా ఉంటే ఈ తరహా వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు శాస్త్రీయమైన సన్నద్ధత చేయొచ్చు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ ప్రణాళికల్లో మార్పులు చేసుకోవచ్చు.

32 ఏళ్లుగా రుతుపవనాల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై నేను అధ్యయనం చేస్తున్నాను. నా అంచనా ప్రకారం ఈ ఏడాది కురిసిన కుండపోత వర్షాల వల్ల నవంబరు, డిసెంబరు నెలల్లో సీజనల్ వ్యాధుల ముప్పు ఉంటుంది. అయినా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలపై అధ్యయనం జరగడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి’’ అని పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు వివరించారు.