6 నెలల్లో ఉప ఎన్నికలు..స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ సుప్రీం కోర్టుకెళ్తాం: కేటీఆర్

6 నెలల్లో ఉప ఎన్నికలు..స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ సుప్రీం కోర్టుకెళ్తాం: కేటీఆర్
  • బాన్సువాడలో పోచారం ఓటమి ఖాయం
  • ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగిందని వ్యాఖ్య

సిద్దిపేట, వెలుగు: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వచ్చే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దీనిపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. 

ఎర్రవల్లి ఫామ్ హౌస్​లో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, వందలాది మంది కార్యకర్తలు బీఆర్ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘వచ్చే ఉప ఎన్నికల్లో బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దయనీయ స్థితిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. 

బీఆర్ఎస్‌‌లో ఉన్న ప్రతి కార్యకర్త తెలంగాణ తెచ్చిన పార్టీలో ఉన్నామని గర్వంగా చెప్పుకోవచ్చు. పాలన చేతగాని కాంగ్రెస్ నేతలు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారు. 21 నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నది. 

పదేండ్లు అధికారంలో ఉండి రూ.2.80 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 21 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రూ.2.20 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పు చేసింది. అయినప్పటికీ ఒక్క సంక్షేమ పథకం, అభివృద్ధి చేసిన దాఖలాల్లేవు’’అని కేటీఆర్ విమర్శించారు.

యూరియా సంక్షోభం వెనుక కుట్ర

యూరియా సంక్షోభం వెనుక కుట్ర ఉందని, పంటల కొనుగోళ్లు, బోనస్‌‌లు ఎగవేయడానికే ప్రభుత్వం కావాలని సరఫరా చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ‘‘దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిన తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతికి అందిస్తే.. నాశనం చేస్తున్నది. ఎన్నికల టైమ్​లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. మేము తీసుకొచ్చిన పథకాలూ, కార్యక్రమాల అమలులో విఫలం అయ్యారు. దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి’’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

బాన్సువాడ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, పలువురు బీఆర్ఎస్​లో చేరారు. కాగా, ఎర్రవల్లి ఫామ్ హౌస్​లో కేసీఆర్ శుక్రవారం గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.