అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న కఠినమైన టారిఫ్ నిర్ణయాలపై చైనా ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం BYD యుద్ధం ప్రకటించింది. అమెరికా ప్రభుత్వ వైఖరిని సవాల్ చేస్తూ కోర్టులో దావా వేయడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ట్రంప్ హయాం నుంచి కొనసాగుతున్న వాణిజ్య ఆంక్షల పరంపరలో భాగంగా.. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విధించిన భారీ సుంకాలను వ్యతిరేకిస్తూ BYD ఈ సాహసోపేత న్యాయ పోరాటం స్టార్ట్ చేసింది.
అమెరికాలో పనిచేస్తున్న BYDకి చెందిన నాలుగు అనుబంధ సంస్థలు ఉన్నాయి. BYD అమెరికా, BYD కోచ్ & బస్, BYD ఎనర్జీ, BYD మోటార్స్ కంపెనీలు సంయుక్తంగా యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో ఈ కేసు వేశాయి. ఒక చైనా వాహన తయారీ సంస్థ అమెరికా సుంకాలను నేరుగా కోర్టులో సవాల్ చేయడం ఇదే మొదటిసారి. జనవరి 26, 2026న ఫైల్ అయిన ఈ కేసు వివరాలు ఫిబ్రవరి 2న బయటకు వచ్చాయి.
BYD వాదన ఏంటి?
అమెరికా ప్రభుత్వం తన అధికార పరిధిని మించి ఈ సుంకాలను విధించిందని BYD వాదిస్తోంది. IEEPA కింద సుంకాలు విధించే చట్టబద్ధమైన అధికారం యూఎస్ ప్రభుత్వానికి లేదని తేల్చాలని చైనా దిగ్గజం కోరుతోంది. ప్రస్తుతం విధిస్తున్న టారిఫ్ ఆర్డర్లను చెల్లనివిగా ప్రకటించి, వాటి అమలును శాశ్వతంగా నిలిపివేయాలని కోర్టుకు విన్నవించింది. అలాగే ఇప్పటివరకు ప్రభుత్వం వసూలు చేసిన సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించేలా ఆదేశించాలని అభ్యర్థించింది. అలాగే తమ న్యాయపరమైన ఖర్చులను కూడా భరించాలని కోరింది బీవైడీ.
అమెరికా విధిస్తున్న ఈ భారీ సుంకాలు కేవలం చైనా కంపెనీలనే కాకుండా.. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి సున్ జియావోహాంగ్ స్పందిస్తూ.. కంపెనీలు తమ హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాడాల్సిన అవసరం వచ్చింది. ఈ రకమైన రక్షణవాద విధానాలు అమెరికా వినియోగదారులకు చౌకైన ఈవీలు అందకుండా అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్, ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం వంటి కీలక విభాగాలను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఇతర కంపెనీలు అమెరికా టారిఫ్ పాలసీలపై కేసులు వేసిన నేపథ్యంలో BYD వేసిన ఈ కొత్త దావా ఇప్పుడు ప్రపంచ వాణిజ్య యుద్ధంలో కీలక మలుపుగా మారింది. BYD తీసుకున్న ఈ నిర్ణయం ఇతర చైనా కంపెనీలకు ధైర్యాన్ని ఇస్తుందా? అమెరికా కోర్టులు ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తాయో వేచి చూడాల్సిందే.
