
న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో వరంగల్ వేదికగా నిర్వహించనున్న రైతు కృతజ్ఞత సభకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయనకు తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. దాదాపు అరగంటకు పైగా రాహుల్‌తో సాగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని, ఇప్పటికే రూ. లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేశామని రాహుల్‌కు సీఎం చెప్పారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్, ఇతర అంశాలను వివరించారు. రుణమాఫీతో పెద్ద సంఖ్యలో పేద రైతు కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని తెలియజేశారు. ఈ దిశలో వరంగల్ వేదికగా రైతు కృతజ్ఞత సభ నిర్వహించాలని భావిస్తున్నామని, సభకు రావాలని రాహుల్‌గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. కాగా, ఉదయం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలను వివరించారు.
రాష్ట్రానికి రావాలని కోరాం: భట్టి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ ఫలాలు తెలుసుకునేందుకు తెలంగాణకు రావాలని రాహుల్‌గాంధీని ఆహ్వానించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. ఈ విషయాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ అంశాలపై అగ్రనేతలకు వివరించినట్లు ఆయన చెప్పారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసి తెలంగాణ పీసీసీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశామన్నారు.
నిధుల కోసం కేంద్ర మంత్రులను కలిశాం: ఉత్తమ్
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం పలువురు మంత్రులను కలిసి ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించామన్నారు. అలాగే పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశామని చెప్పారు. ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించామన్నారు.
ఖర్గేకు బర్త్ డే విషెస్
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఖర్గేను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు
అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.