ఆహార పదార్థాల కల్తీపై ఫిర్యాదు చేయండి

ఆహార పదార్థాల కల్తీపై ఫిర్యాదు చేయండి
  • ప్రజలకు ఐపీఎం డైరెక్టర్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్‌‌‌‌ సి.శివలీల కోరారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌ నారాయణగూడలోని ఐపీఎం ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆహార పదార్థాల కల్తీపై ప్రజల నుంచి స్పందన తక్కువగా ఉందని శివలీల అన్నారు. ప్రతి ఒక్కరూ స్పందించి ఫిర్యాదులు చేస్తేనే కల్తీని అరికట్టగలమని చెప్పారు. 33 జిల్లాలకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల ఫోన్ నంబర్లను మీడియాకు విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ పరిధిలో సర్కిళ్ల వారీగా, 33 జిల్లాలకు కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉన్నారని చెప్పారు. త్వరలోనే ఆయా ఆఫీసర్ల ఫోన్‌‌‌‌ నంబర్లను ఐపీఎం వెబ్‌‌‌‌సైట్‌‌‌‌(http://ipm.telangana.gov.in/ )లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కల్తీ టీ పౌడర్‌‌‌‌‌‌‌‌ను గుర్తించడంపై అవగాహన కల్పిస్తూ  టీ పౌడర్ మర్చంట్స్ అసోసియేషన్ రూపొందించిన పోస్టర్లను ఆమె విడుదల చేశారు.