
కోల్‌కతా: సిటిజన్‌షిప్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న బెంగాల్ స్టూడెంట్స్ కొత్త తరహాలో తమ నిరసన వ్యక్తం చేశారు. వివిధ యూనివర్సిటీల్లో జరిగిన కాన్వొకేషన్లలో డిగ్రీలు తీసుకోకుండా నిరసన తెలిపారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన కాన్వొకేషన్‌లో ఎంఏ డిగ్రీ తీసుకున్న దెబ స్మిత చౌధురి స్టేజ్‌పైనే సీఏఏ కాపీలను చించేసి నిరసన వ్యక్తం చేసింది. వీసీ చేతుల మీదుగా సర్టిఫికెట్, గోల్డ్‌మెడల్ తీసుకున్న ఆ స్టూడెంట్ వన్ మినిట్.. అని అడిగి తనతో పాటు తెచ్చుకున్న సీఏఏ కాపీలను స్టేజ్‌పైనే చించేసిన వీడియో బయటకు వచ్చింది. ‘మేం ఐడీలు చూపించం. ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ ఆమె స్లోగన్స్ చేసింది.
“ జాదవ్‌పూర్ యూనివర్సిటీని నేను కించపరచడం లేదు. నాకు ఇష్టమైన యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్నందుకు గర్వపడుతున్నాను. సీఏఏకు నేను వ్యతిరేకం అని ఈ స్టేజ్ నుంచి తెలియజేయాలనుకున్నాను. నా ఫ్రెండ్స్ గేటు బయట నిరసన చేస్తున్నారు” అని ఆమె చెప్పింది. కాన్వొకేషన్‌కు అటెండైన 25 మంది స్టూడెంట్స్ డిగ్రీలు తీసుకోకుండా నిరసన తెలిపారు. మంగళవారం కాన్వొకేషన్‌కు అటెండయ్యేందుకు యూనివర్సిటీకి వచ్చిన బెంగాల్ గవర్నర్ ధన్‌కర్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారు.
బెనారస్ వర్సిటీలోనూ ఇదే పరిస్థితి
బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఇదే విధంగా నిరసన చేపట్టారు. రజత్ సింగ్ అనే స్టూడెంట్ స్టేజ్‌పైకి వెళ్లి డిగ్రీ తీసుకోకుండా వచ్చేశాడు. దేశాన్ని విభజించే ఏ చట్టాన్ని ఒప్పుకోమని అన్నాడు. పోలీసులు స్టూడెంట్స్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని, తమతో పాటు డిగ్రీలు తీసుకోవాల్సిన వాళ్లు జైల్లో ఉంటే మేనేజ్‌మెంట్ పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేశారు.