శంషాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ దారుణం.. ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నం, రూ.60 వేల నగదుతో పరారీ

శంషాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ దారుణం.. ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నం, రూ.60 వేల నగదుతో పరారీ

శంషాబాద్: హైదరాబాద్ శంషాబాద్‌లో ఓ ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. తొండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో రూట్ మార్చిన డ్రైవర్.. ప్రయాణికురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడికి ప్రయత్నించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద సాధారణ మార్గాన్ని మార్చి వేరే దారిలోకి తీసుకెళ్లాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆమె ఆరోపించింది.డ్రైవర్ చర్యలను గమనించిన బాధితురాలు కారు నుంచి దిగి కేకలు వేయడంతో అతడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. అయితే బాధితురాలి నుంచి సుమారు రూ.60 వేల నగదు ఉన్న బ్యాగ్‌ను డ్రైవర్ తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడి గుర్తింపు తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.