
- కిందటేడాది కరోనా.. ఇప్పుడు పెరిగిన పెట్రో రేట్లు
- కమీషన్ తగ్గించుకోని క్యాబ్ కంపెనీలు
- సర్కారు జీవోలను కాదని తక్కువ చెల్లిస్తూ దోపిడీ
- రూల్స్ అమలును పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
ఈ ఫొటోలోని వ్యక్తి రాజుయాదవ్.. హుస్నాబాద్. మొన్నటి దాకా హైదరాబాద్‌లో ఓలా కంపెనీలో క్యాబ్ నడిపే వారు. కరోనాకు తోడు డీజిల్ రేట్లు పెరిగిపోవడంతో క్యాబ్ ఎంత నడిపినా గిట్టుబాటు కాలేదు. పైసల్లేక ఈఎంఐలు కట్టలేదు. దీంతో ఫైనాన్షియర్లు బండిని గుంజుకపోయిన్రు. చేసేదేం లేక సొంతూర్లో గొర్లను కాస్తున్నడు.
హైదరాబాద్, వెలుగు: మొన్నటి దాకా కరోనా ఎఫెక్ట్.. ఇప్పుడు పెరిగిన డీజిల్, పెట్రోల్ రేట్లు.. వీటికి తోడు కమీషన్‌ను తగ్గించుకోవాలన్న సర్కారు జీవోను క్యాబ్ కంపెనీలు పట్టించుకోకపోవడంతో క్యాబ్ డ్రైవర్లు ఆగమైతున్నరు. పూట గడవక నానాయాతన పడుతున్నరు. రోజంతా పనిచేసినా గిట్టుబాటైతలేదు. దీంతో ఈఎంఐలు చెల్లించలేక, క్యాబ్‌లను నడపలేక కొందరు డ్రైవర్లు బండ్లను అమ్మేసుకుంటున్నరు. కొందరి బండ్లను ఫైనాన్స్ కంపెనీలు తీసుకుపోయినయ్. దీంతో చాలా మంది డ్రైవర్లు రోజువారీ కూలీలుగా మారిన్రు. ఫుడ్ డెలివరీ బాయ్స్ పరిస్థితి కూడా ఇట్లనే ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల వరకు క్యాబ్స్, ప్రైవేట్ ట్రావెల్ వెహికల్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువగా హైదరాబాద్‌లోని ఓలా, ఉబర్ తదితర కంపెనీల్లో నడుపుకుంటున్నారు. అయితే రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రో ధరలు డ్రైవర్లకు గుదిబండగా మారుతున్నాయి. కిందటేడాది మార్చిలో లీటర్ పెట్రోల్ రూ.75, డీజిల్ రూ.69గా ఉంది. కానీ గురువారం లీటర్ పెట్రోల్ రూ. 111, డీజిల్ రూ.103 దాకా ఉంది. అంటే సుమారుగా పెట్రోల్‌పై రూ.36, డీజిల్‌పై రూ.34 వరకు పెరిగింది. దీంతో ఒక్కో డ్రైవర్‌పై భారీగా అదనపు భారం పడుతోంది. కరోనా కంటే ముందు రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేస్తే ఒక్కో డ్రైవర్‌కు రూ.600 నుంచి రూ.800 వరకు వచ్చేవి. కానీ ఇప్పుడు రోజంతా పనిచేసినా రూ.500 దాటడం లేదని డ్రైవర్లు వాపోతున్నరు. ప్యాసింజర్లు ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ పెడితే డ్రైవర్లు రైడ్‌లను క్యాన్సిల్ చేస్తున్నరు. ఆన్‌లైన్ పేమెంట్ చేయడం వల్ల నేరుగా క్యాబ్ కంపెనీలకే అమౌంట్ జమ అవుతోంది. అందులో డ్రైవర్ పేమెంట్స్ వారానికి గానీ చెల్లించడంలేదు. ఈ మధ్యలో పెట్రోల్, డీజిల్‌కు పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లు.. ఆన్‌లైన్ పేమెంట్స్ అంటేనే క్యాన్సిల్ చేస్తున్నారు.
దెబ్బకొట్టిన కరోనా
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. క్యాబ్ డ్రైవర్లు కూడా చాలా ఇబ్బందిపడ్డారు. కరోనా భయంతో క్యాబ్‌ల్లో వెళ్లేందుకు జనం ఇంట్రెస్ట్ చూపించలేదు. లాక్‌డౌన్ విధించడంలో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలు నిలిచిపోయాయి. కొంత మంది ఇంటికే పరిమితం కాగా, మరికొంత మంది జనం సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో జనం లేక క్యాబ్‌లు వెలవెలబోయాయి. హైదరాబాద్‌లో ఐటీ సెక్టార్‌లో సుమారు 30 వేల క్యాబ్‌లు హైరింగ్‌లో ఉండేవి. వీటిల్లో రోజూ ఐటీ ఉద్యోగులను డ్రైవర్లు తీసుకెళ్లేవారు. ఈ డ్రైవర్లకు నెలకు రూ.30 నుంచి రూ.35 వేల వరకు వచ్చేవి. కానీ ఐటీ సెక్టార్‌లో ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం కొనసాగుతుండటంతో అక్కడికి తిరిగే క్యాబ్‌లు బాగా తగ్గిపోయాయి. కరోనా భయంతో సిటీకి టూరిస్టులు రాకపోవడంతో క్యాబ్ సర్వీసులు మరింతగా దెబ్బతిన్నాయి.
బండ్లను అమ్ముకుంటున్నరు
రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఇచ్చిన జీవో నంబర్లు 61, 66 ప్రకారం ప్రీపెయిడ్ మీటర్ బండ్లకు క్యాబ్ కంపెనీలు కిలోమీటర్‌కు రూ.17 చెల్లించాలని క్యాబ్ యూనియన్లు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం కంపెనీలు రూ.12 మాత్రమే ఇస్తున్నాయి. కంపెనీలు రూల్స్ పాటించకున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ప్రయాణికులు, డ్రైవర్లను విచ్చలవిడిగా దోచుకుంటున్న కంపెనీలను కంట్రోల్ చేస్తేలేదు. ఫలితంగా క్యాబ్ డ్రైవర్లు నలిగిపోతున్నరు. ఎంత చేసిన పని గిట్టుబాటు కావడంలేదు. కొంత మంది డ్రైవర్లు ఈఎంఐలు చెల్లించలేక బండ్లను అమ్ముకుంటున్నరు. ఇటీవల కాలంలో సుమారు 20 వేల మంది బండ్లను అమ్ముకున్నట్లు క్యాబ్ యూనియన్లు చెబుతున్నాయి. మరికొంత మంది డ్రైవర్ల క్యాబ్‌లను ఫైనాన్షియర్లు గుంజుకుపోయారని పేర్కొంటున్నాయి.
డెలివరీ బాయ్స్ పరిస్థితి కూడా ఇట్లనే..
హైదరాబాద్‌తో పాటు పెద్ద పట్టణాల్లో పని చేస్తున్న ఫుడ్ డెలివరీ బాయ్స్ పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. వీరికి కిలోమీటర్, ఆర్డర్స్‌ను బట్టి పేమెంట్స్ చేస్తారు. కరోనా కంటే ముందు 4.5 కి.మీ పరిధిలో రూ.35 ఇచ్చే వారు. కానీ ఇప్పుడు మాత్రం వివిధ కారణాలు చెబుతూ రూ.20కి తగ్గించారు. ఓ వైపు అమౌంట్ తక్కువగా ఇవ్వడం, మరో వైపు పెట్రో రేట్లు పెరగడంతో చేసిన పనికి గిట్టుబాటు కాక చాలా మంది డెలివరీ పనిని బంద్ చేస్తున్నారు.