హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్.. సెప్టెంబర్ క్వార్టర్లో 52 శాతం పెరిగిన అమ్మకాలు..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్.. సెప్టెంబర్ క్వార్టర్లో 52 శాతం పెరిగిన అమ్మకాలు..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ మార్కెట్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతూ అమ్మకాల విషయంలోనూ ముందంజలోనే ఉంది. 2025 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నగరంలో 20వేలకు పైగా హౌసింగ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 52.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే క్రమంలో హైదరాబాద్ నగరంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం 46.6% పెరిగి, పెట్టుబడిదారుల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ప్రపంచ సంస్థలకు ప్రస్తుతం అడ్డాగా మారుతున్న హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన.. ఐటీ కారిడార్ల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, స్థిరమైన ఆర్థిక వాతావరణం ఈ ఉత్సాహానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అలాగే ఔటర్ రింగ్ రోడ్ విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో పొడిగింపు వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు నగర పరిసర ప్రాంతాలకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుండటంతో.. ప్రాపర్టీల కొనుగోళ్లు, సప్లై రెండూ గణనీయంగా పెరిగాయి. 

ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాజెక్టులు..

ప్రధానంగా కోకాపేట్, తెల్లాపూర్, గచ్చిబౌలి, నార్సింగి ప్రాంతాల్లో మధ్యతరగతి, ప్రీమియం సెగ్మెంట్లలో కొత్త ప్రాజెక్టులు భారీగానే ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో పటాన్ చెరు, కొంపల్లీ, శామీర్పేట్ వంటి ఉభయ మండల ప్రాంతాల్లో ధరలు కొంత చవకగా ఉండటంతో కొనుగోలు దారుల నుంచి ఆసక్తి పెరుగుతోంది. అలాగే గత ఏడాదితో పోల్చితే సగటున హోమ్ ధరలు 15 శాతం పెరగటం గమనార్హం. పెరిగిన వ్యయాలతో పాటు డిమాండ్ కారణంగా డెవలపర్లు కొత్తగా ప్రారంభించిన యూనిట్లు వేగంగా అమ్ముడవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

గడచిన కొంత కాలంగా హైదరాబాద్ నగరంలో ప్రీమియం, లగ్జరీ హౌసింగ్‌ మార్కెట్‌ కూడా గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. అధునాతన సౌకర్యాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీలు, మంచి జీవనశైలిని అందించే ప్రాజెక్టులపై కొనుగోలుదారుల ఆసక్తి పెరిగింది. అయితే ధరల పెరుగుదల యథేచ్ఛగా కొనసాగితే ప్రజలకు ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వడ్డీ రేట్లు, భూమి ధరలు పెరగడం వల్ల ఎంట్రీ-లెవల్ బడ్జెట్ హోమ్స్ కొనుగోళ్లు ప్రభావితం కావచ్చని వారు అంటున్నారు.