ముగ్గురు కూతుర్లను బస్టాప్ దగ్గర డ్రాప్ చేసిన తండ్రి.. కొన్ని గంటల్లోనే శవాలుగా కన్నోళ్ల కళ్ల ముందు..

ముగ్గురు కూతుర్లను బస్టాప్ దగ్గర డ్రాప్ చేసిన తండ్రి.. కొన్ని గంటల్లోనే శవాలుగా కన్నోళ్ల కళ్ల ముందు..

చేవెళ్ల: ఈ ముగ్గురు యువతులు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. వీకెండ్ కావడంతో ఇంటికి వెళ్లారు. కాలేజ్కి వెళ్లేందుకు ఈరోజు తెల్లవారుజామున సొంతూరు అయిన వికారాబాద్ జిల్లా యాలాల మండలం పేర్కంపల్లి గ్రామం నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. ముగ్గురిని తండ్రి బస్టాప్ వద్ద డ్రాప్ చేశాడు. దగ్గరుండి మరీ బస్ ఎక్కించాడు. ముగ్గురు కూతుర్లు తండ్రికి సంతోషంగా Bye చెప్పారు. కానీ.. అవే ఈ ముగ్గురు కూతుర్లు పలికే చివరి మాటలు అవుతాయని ఆ కన్న తండ్రి కలలో కూడా అనుకోలేదు.

నవ్వుతూ సరదాగా వెళ్లిన ముగ్గురు కూతుర్లు ఆ తల్లిదండ్రులకు మృతదేహాలుగా కనిపించారు. కన్న వాళ్లు ఈ బాధ భరించలేక గుండెలవిసేలా రోదించారు. ముగ్గురమ్మాయిల ఫ్రెండ్స్ విషాదంతో విలపించారు. మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ముగ్గురిని నందిని, సాయి ప్రియ, అనూషగా పోలీసులు గుర్తించారు.

ఈ అమ్మాయిల సొంతూరు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పేర్కంపల్లి గ్రామం. ఈ అమ్మాయిల తండ్రి ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్నాడు. చనిపోయిన ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు. పెద్దమ్మాయి ఎంబీఏ చదువుతోంది. ఈ ముగ్గురు అమ్మాయిలకు మరో అక్క ఉంది. ఆమెకు ఇటీవలే పెళ్లైంది. సొంతూరు నుంచి హైదరాబాద్ కు బస్సులో వెళుతుండగా ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఇలా మృత్యువు టిప్పర్ రూపంలో కబళించింది.