ఈరోజుల్లో మోస్ట్ ఫేమస్ పెట్టుబడుల్లో ఒకటి మ్యూచువల్ ఫండ్స్. క్రిప్టోలు, ఈక్విటీలు లాంటి ఇతర పెట్టుబడుల కంటే రిస్క్ తక్కువగా ఉండటమే ఇవి ప్రాచుర్యం పొందటానికి కారణంగా తెలుస్తోంది. అయితే ఎవరైనా ఇన్వెస్టర్ సరైన మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవటానికి ముందు పరిశీలించాల్సిన 6 విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ వివిధ స్కీమ్స్ కింద పెట్టుబడి పెడుతున్న ఇన్వెస్టర్ల నుంచి నిధులను సేకరించి వాటిని షేర్లు, బాండ్లు, ఇతర సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతుంటాయి. అయితే ఈ నిధులను నిపుణులు నిర్వహించడంతో.. పెట్టుబడిదారులు మార్కెట్‌ను బాగా అర్థం చేసుకోకపోయినా క్రమంగా మంచి రాబడి పొందవచ్చు. షేర్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడం కంటే ఇది ఒక సురక్షిత, సౌకర్యవంతమైన మార్గంగా ఉండటం వల్ల లక్షల మంది ఇన్వెస్టర్లు ఆకర్షితమౌతున్నారు వీటివైపు.
మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడానికి గమనించాల్సిన 6 పాయింట్లు..
1.AUM (అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్): ఫండ్ మొత్తం నిర్వహణలో ఉన్న నిధుల విలువ కనీసం రూ.వెయ్యి కోట్లకు పైగా ఉండాలి. తక్కువ అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ ఉన్న ఫండ్‌లు ఎక్కువగా రిస్క్‌లో ఉంటాయి.
2. ఫండ్ ఏజ్: కనీసం 5 ఏళ్ల నుంచి ఉన్న ఫండ్ ఎంచుకోవటం మంచిది. దీని ద్వారా వివిధ మార్కెట్ పరిస్థితుల్లో ఫండ్ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
3. Expense Ratio: ఫండ్ నిర్వహణకు తీసుకునే ఛార్జీలు లేదా ఖర్చులు తక్కువగా ఉండాలి. తక్కువ ఖర్చు అంటే ఇన్వెస్టర్లు ఎక్కువ లాభం పొందొచ్చు. ఎక్స్ పెన్స్ రేషియో ఈ ఖర్చులనే సూచిస్తుంది.
4. ఆల్ఫా (Alpha): ఫండ్ మార్కెట్ ఇండెక్స్‌ను మించి ఎంత రాబడి ఇస్తోంది అనేది ఈ ఆల్ఫా తెలియజేస్తుంది. అందుకే దీనిని ఎంచుకునే ఫండ్ విషయంలో ఇతరులతో కంపేర్ చేయండి.
5. బీటా (Beta): బీటా ఫండ్ కి అలాగే మార్కెట్‌కి సంబంధించిన ప్రమాదాన్ని సూచిస్తుంది. బీటా 1 కన్నా ఎక్కువైతే ఆ ఫండ్‌లు అధిక రిస్క్ కలిగి ఉన్నాయని అర్థం.
6. టర్నోవర్ రేషియో: ఫండ్ తన పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో ఎంత తరచుగా ట్రేడ్ లేదా మార్పులు చేస్తుందో సూచిస్తుంది. 40% కన్నా తక్కువ అయితే తక్కువ రిస్క్ కలిగి ఉన్నట్లు అన్నమాట.
పైన పేర్కొన్న అంశాలతో పాటు ఇన్వెస్టర్లు ముందుగానే తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్థారించుకోవాలి. వెంటనే డబ్బు కావాలంటే లిక్విడ్ ఫండ్స్ అన్నింటి కంటే బెటర్. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలకు (ఉదా: రిటైర్మెంట్, పిల్లల విద్య) ఈక్విటీ ఫండ్‌లు మంచివి. మీ రిస్క్ టాలరెన్స్, పెట్టుబడి వ్యవధిని బట్టి సరైన మ్యూచువల్ ఫండ్ ఎంచుకోండి. ఈ విషయంలో ఏదైనా అవసరం అయితే నిపుణులను లేదా మ్యూచువల్ ఫండ్ కస్టమర్ కేర్ ద్వారా సలహాలు సూచనలు తీసుకోవటం మంచిది. మీ అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయటం ఉత్తమం.
