చేవెళ్ల బస్సు ప్రమాదంపై సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి రియాక్షన్ ఇది..

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి రియాక్షన్ ఇది..

సోమవారం ( నవంబర్ 3 ) ఉదయం జరిగిన చేవెళ్ల బస్సు ప్రమాదం పెను విషాదంగా మారింది. కంకర లోడుతో అతివేగంగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి స్పందించారు. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నిర్మాణ పనుల కోసం కంకర లోడ్ తో టిప్పర్ వెళ్తోందని.. టిప్పర్ లోడ్ ఎక్కడికి తీసుకెళ్తోంది, టిప్పర్ ఓనర్ ఎవరు వంటి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు.

తాండూర్ నుండి హైదరాబాద్ బయలుదేరిన ఈ బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారని.. ప్రమాదంలో 19 మరణించారని వెల్లడించారు సీపీ అవినాష్ మొహంతి. కొంతమంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యిందని.. ప్రమాదంలో గాయపడ్డవారికి చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి, పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు.

►ALSO READ | ముగ్గురు కూతుర్లను బస్టాప్ దగ్గర డ్రాప్ చేసిన తండ్రి.. కొన్ని గంటల్లోనే శవాలుగా కన్నోళ్ల కళ్ల ముందు..

టిప్పర్ రాంగ్ రూట్లో, ఓవర్ స్పీడ్ తో రావడమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలిందని అన్నారు అవినాష్ మొహంతి. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. చనిపోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు.. ఆర్టీసీ తరపున 2 లక్షల రూపాయలు.. మొత్తం 7 లక్షల రూపాయలను తక్షణ సాయంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు 2 లక్షల రూపాయల ఆర్థిక తక్షణ సాయం ప్రకటించిన మంత్రి.. బాధితులకు మెరుగైన వైద్యం అందించనున్నట్లు స్పష్టం చేశారాయన. చికిత్స కోసం అవసరం అయితే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ వైద్యం అందిస్తామని.. బాధితులకు అండగా నిలబడతాం అని భరోసా ఇచ్చారు.