శంషాబాద్ విమానాశ్రయంలో ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల ఆందోళన

శంషాబాద్ విమానాశ్రయంలో ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల ఆందోళన
  • శంషాబాద్ విమానాశ్రయంలో ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల ఆందోళన
  • ట్యాక్సీ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి
  • ఓలా, ఉబర్ సంస్థలతో నష్టపోతున్నాం
  • జై డ్రైవరన్న అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధార్థ్ గౌడ్

శంషాబాద్, వెలుగు: ఓలా,ఉబర్ యాజమాన్యాలు క్యాబ్ డ్రైవర్లకు సరైన ట్రిప్పులు ఇవ్వడం లేదంటూ శనివారం శంషాబాద్ ఎయిర్‌‌‌‌ పోర్టులో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన కు దిగారు. ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్లు మాట్లాడుతూ..సరైన ట్రిప్పులు ఇవ్వడం లేదని,ఇచ్చిన ట్రిప్పుల్లో సగభాగం కట్ చేసుకుని ఇస్తున్నారని నిరసనకు దిగారు. క్యాబ్‌‌లను నిలిపివేసి నిరసన కొనసాగించారు. 1200 మంది క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు.  

ఎయిర్‌‌‌‌ పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు రూ. 400 ఇస్తున్నారని అందులో నుంచే టోల్ ఫీజు, పార్కింగ్, రింగ్ రోడ్డు టోల్ ఫ్రీ, డీజిల్ ఖర్చులు పోనూ కేవలం రూ. 150 మిగులుతున్నాయని వీటితో భార్యా, పిల్లలను ఎలా పోషించుకోవాలని ఆవేదన చెందారు. అనంతరం యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

దీంతో ఆర్జీఐఏ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, నిరసనలు చేయకూడదని వారికి తెలిపారు.ఏదైనా ఇబ్బందులు ఉంటే యాజమాన్యంతో కూర్చుని మాట్లాడుకోవాలని ఏసీపీ రామచంద్రరావు, సీఐ శ్రీనివాస్, ఎస్ ఐ సుమన్ క్యాబ్ డ్రైవర్లకు సూచించారు.  

​ఖైరతాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎంపీలు ట్రాన్స్​పోర్ట్​ రంగంలోకి వచ్చి తమ పొట్ట కొడుతున్నారంటూ జై డ్రైవరన్న అసోసియేషన్ అధ్యక్షుడు ఉసిరికాయల సిద్ధార్థ్ గౌడ్​ ఆరోపించారు.​ శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓలా, ఉబర్​ వంటి ట్యాక్సీలకు సీఎం క్యాంపు ఆఫీసు వద్ద జెండా ఊపి కేటీఆర్​ ప్రారంభించారని గుర్తుచేశారు. ఇది ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. 

కరోనా సమయంలో 150 మంది డ్రైవర్లు ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన  వ్యక్తంచేశారు. క్యాబ్​బుకింగ్​కోసం ప్రభుత్వం సొంత యాప్​ ను తయారుచేసి పెట్టాలని, లేదంటే మీటర్​విధానం అమలు చేయాలని కోరారు.ప్రతి డ్రైవర్​ కుటుంబానికి ఈఎస్​ఐ,హెల్త్​ కార్డులు ఇవ్వాలని,  డ్రైవర్లు తీసుకున్న వాహనాలకు రుణమాఫీ చేయాలని, రూ.10 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్​ కల్పించాలని డిమాండ్​ చేశారు. 

లేదంటే బీఆర్ఎస్ కు కాకుండా కాంగ్రెస్​కు మద్దతు తెలుపుతామని ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో మల్లేశ్​ యాదవ్ ​, నర్సింహ, ప్రభు, నరేశ్​​ తదితరులు పాల్గొన్నారు.