
- మాస్కోలో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
- సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 34కు పెంపు
- చిట్‌ఫండ్స్ సవరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: న్యాయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో కీలక మార్పులతోపాటు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంచే పలు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశం వివరాలను మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) టెక్నికల్ లైజన్ యూనిట్(ఐటీఎల్యూ)ను రష్యా రాజధాని మాస్కోలో ఏర్పాటుచేసే ప్రక్రియకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నలిచ్చింది. 2022లో ఇండియన్‌ను స్పేస్‌లోకి పంపే ఆపరేషన్ ‘గగన్‌యాన్’కు సంబంధించి ఈ యూనిట్ కీలకం కానుంది. స్పేస్ రంగానికి సంబంధించిన పలు అంశాల్లో రష్యా సహా వివిధ దేశాలతో సమన్వయాన్ని పెంపొందించుకోవడంలోనూ దీన్నొక ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. జవదేకర్ వెల్లడించిన ఇతర అంశాలిలా ఉన్నాయి..
చిట్‌ఫండ్స్ సవరణ బిల్లు
దేశంలో రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ రంగం మరింత అభివృద్ది చెందేలా దాన్ని రెగ్యులరైజ్ చేయడం, అలాగే చందాదారుల ప్రయోజనాల్ని కాపాడటమే లక్ష్యంగా రూపొందించిన చిట్‌ఫండ్స్ సవరణ బిల్లు(2019)కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును గత లోక్‌సభలోనే ప్రవేశపెట్టినప్పటికీ, కాలపరిమితి ముగియడంతో మరోసారి కేబినెట్ ఆమోదం అనివార్యమైంది. ప్రైజ్‌చిట్స్ నుంచి చిట్‌ఫండ్‌కు భద్రత కల్పించడం, చందాదారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాట పాడేందుకు వీలు కల్పించడం, ఫోర్‌మ్యాన్ కమీషన్‌ను ఐదు నుంచి ఏడు శాతానికి పెంచడం, 1982 చిట్‌ఫండ్ చట్టంలోని 85 (బి) సెక్షన్‌ను సవరించడం ద్వారా సీలింగ్‌ను నిర్ధారించే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకే కట్టబెట్టడం లాంటి ప్రతిపాదనలు కొత్త బిల్లులో ఉన్నాయి. ఇది ప్రభుత్వాలకు వదిలివేస్తున్నారు. త్వరలోనే ఈ బిల్లు లోక్‌సభ ముందుకు రానుంది.
సుప్రీం జడ్జిల సంఖ్య పెంపు
ప్రస్తుతం సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్‌తో కలిపి 31 మంది జడ్జిలున్నారు. ఈ సంఖ్యను 34కు పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు ఆమోదం లభించాక జడ్జిల నియామకం చేపడతారు. కేసుల సంఖ్యను బట్టి జడ్జిలనూ పెంచాలని సీజేఐ గొగోయ్ ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. చివరిసారిగా 2009లో సుప్రీం జడ్జిల సంఖ్య 25 నుంచి 30కి పెంచారు. 2019, జులై 11 నాటికి సుప్రీంకోర్టులో 59, 331 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ప్రకటించారు.
జమ్మూకాశ్మీర్‌లో ‘10 శాతం కోటా’ బిల్లు
ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్‌లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశముంది. ఇంటర్నేషనల్ బోర్డర్, ఎల్వోసీకి 10 కిలోమీటర్ల పరిధిలో నివసించే పౌరులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఇటీవలే లోక్‌సభ ఆమోదం తెలిపింది.
ఓబీసీ ప్యానెల్ గడువు పెంపు
ఇతర వెనుకబడిన కులాలు(ఓబీసీలను) సబ్ కేటగిరీలుగా విభజించే అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ప్యానెల్ గడువును మరో ఆరు నెలలు పెంచారు.
యూఎన్ఐఎస్ఏపై సంతకం
విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించేలా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్‌ను అడాప్ట్ చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ సెటిల్మెంట్ అగ్రిమెంట్స్(యూఎన్ఐఎస్ఏ)పై సంతకం చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 7న సింగపూర్‌లో లేదంటే యూఎన్ హెడ్‌క్వార్టర్స్‌లోనే యూఎన్ఐఎస్ఏపై ఇండియా సంతకం చేయనుంది.