ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్: రూ.3,737 కోట్ల బోనస్

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్: రూ.3,737 కోట్ల బోనస్

దసరా పండుగ ముందు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 30 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రొడక్టివ్, నాన్ ప్రొడక్టివ్ లింక్డ్ బోనస్ ప్రకటించింది. శాలరీతో సంబంధం లేకుండా.. రూ.3,737 కోట్ల నిధులను దసరా పండుగకు ముందుగానే నేరుగా ఉద్యోగుల అకౌంట్‌లో డిపాజిట్ చేసేందుకు బుధవారం నాడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా 30 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 2019-20కి సంబంధించిన బోనస్ అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పకాశ్ జవదేకర్ తెలిపారు. కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. విజయ దశమి లోపే ఉద్యోగుల అకౌంట్లోకి ఆ సొమ్మును ఒకేసారి డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. పండుగ సమయంలో మిడిల్ క్లాస్ ప్రజల చేతిలోకి డబ్బులు వస్తే వారి కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్లకు మంచి బూస్టింగ్ అవుతుందని మంత్రి అన్నారు.

మొత్తం 30 లక్షల మంది ఉద్యోగుల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వే, పోస్టాఫీస్, ఈపీఎఫ్‌వో, ఈఎస్ఐసీ ఇతర ప్రొడక్టివ్ సంస్థల్లో పని చేసేవారే 17 లక్షల మంది ఉన్నారు. వీరికి రూ.2,791 కోట్ల ప్రొడక్టివ్ లింక్డ్ బోనస్ ప్రకటించింది కేంద్రం. మిగిలిన 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు.. వీరికి రూ.946 కోట్ల నాన్ ప్రొడక్టివ్ లింక్డ్ బోనస్ రూపంలో అందిస్తోంది.

ప్రతి ఏటా దసరా పండుగ ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది ప్రకటన లేట్ కావడంతో దసరాకు ముందు బోనస్ ఇవ్వకుంటే ఆక్టోబర్ 22న కొన్ని గంటల పాటు రైళ్లను నిలిపేస్తామని రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. కరోనా పేరు చెప్పి గత ఏడాదికి సంబంధించిన ప్రొడక్టివ్ బోనస్ నిలిపేయాలని ఆలోచిస్తుంటే అది సరైన నిర్ణయం కాదని ఆలిండియా రైల్వే ఫెడరేషన్ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది.