- ఏడాదికి 6 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం
- కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
- పుణె మెట్రో పొడిగింపునకు రూ.9,858 కోట్లు
- గుజరాత్‌లోని ద్వారక-కర్నాలస్ లైన్ డబ్లింగ్ పనులకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో రేర్ ఎర్త్ మాగ్నెట్ ప్రొడక్షన్‌ను పెంచేందుకు కేంద్ర సర్కారు స్పెషల్ ఇంటెన్సివ్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ‘సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్’ (ఆర్‌ఈపీఎం) తయారీని ప్రోత్సహించేందుకు రూ.7280 కోట్లు కేటాయించింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అనంతరం వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశంలో ఏడాదికి 6 వేల మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ మాగ్నెట్స్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. గ్లోబల్ కాంపిటీటీవ్ బిడ్డింగ్ద్వారా వీటి ఉత్పత్తి బాధ్యతలు ఐదుగురికి కేటాయిస్తారు. ఒక్కొక్కరికీ 1,200 టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశిస్తారు. ఏడేండ్ల వరకూ ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. ఇందులో మొదటి రెండేండ్లు ఆర్‌ఈపీఎం తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు గెస్టేషన్ పీరియడ్ కాగా.. ఆ తర్వాత ఐదేండ్లు వీటి అమ్మకాలపై ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. దేశంలో హైటెక్ మాగ్నెట్లను తయారు చేయడమే దీని లక్ష్యం. ఈ మాగ్నెట్లను ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో వినియోగిస్తారు.
రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్
రూ. 9,858 కోట్లతో పుణె మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫేజ్ 2 కింద లైన్ 4, లైన్ 4ఏను ఆమోదించినట్టు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇది ఈ ఫేజ్ కింద ఆమోదించిన రెండో ప్రాజెక్ట్ అని తెలిపారు. 28 ఎలివేటెడ్ స్టేషన్లతో 31 కిల్లో మీటర్లు విస్తరించి ఉందని చెప్పారు. కాగా, గుజరాత్‌లోని ద్వారక –- కర్నాలస్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1,457 కోట్లు కేటాయించింది. ఈ డబ్లింగ్ పనులతో ద్వారకాధీశ్ ఆలయానికి కనెక్టివిటీ పెరుగుతుంది. బొగ్గు, ఉప్పు, సిమెంట్‌లాంటి వస్తువుల రవాణా మెరుగుపడుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే, రూ. 1,324 కోట్లతో మహారాష్ట్రలోని బద్లాపూర్ –కర్జాత్ థర్డ్, ఫోర్త్ రైల్వే పనులకు కేబినెట్ అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఈ రెండు రైల్వే ప్రాజెక్టులకు దాదాపు రూ.2,781 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని 4 జిల్లాలను కవర్ చేసే ఈ 2 ప్రాజెక్టులు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను దాదాపు
224 కిలోమీటర్లు పెంచుతాయని చెప్పారు.
