
= పీసీసీలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు!
= వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే?
= దాదాపు కొలిక్కి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గం
హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. రేపు క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉండటంతో మంత్రి వర్గ విస్తరణ రేపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గంపై ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది. పీసీసీ కార్యవర్గాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ బిజీబిజీగా గడుపుతున్నారు.
మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. దీంతో రేవంత్, మహేశ్ కుమార్ వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. కొత్తగా మంత్రివర్గంలో చోటుదక్కించుకునే ఆ లక్కీ సిక్స్ హ్యాండ్స్ ఎవరనే చర్చ నడుస్తోంది. రేసులో వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, పీ సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా ప్రస్తుతం ఎమ్మెల్సీ, సినీనటి విజయశాంతి పేరు కూడా తెరమీదకు వచ్చింది. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి తనకు కేటాయించాలని ఆమె అధినాయకత్వాన్ని కోరుతున్నట్టు సమాచారం.
మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయుగ్ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ప్రధాని, మంత్రులను కలుస్తున్నారు. నిన్న (May 25) సాయంత్రం కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ని వీరు కలిశారు.
సుమారు గంట పాటు చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించినట్లు సమాచారం. అయితే రాష్ట్ర కేబినెట్ పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినప్పటికీ రాహుల్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఆయన వచ్చి ఫైనల్ చేస్తేనే లక్కీ సిక్స్ ఎవరనేది తేలుతుంది.