రేపు కేబినెట్ భేటీ..కీలకాంశాలపై చర్చ

రేపు కేబినెట్ భేటీ..కీలకాంశాలపై చర్చ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ గురువారం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నా రు. రాష్ట్ర ఆదాయం పెంచుకోవడం, ఇతర అంశా లపై మంత్రివర్గం చర్చించనుంది. వీటితోపాటు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది.  రాష్ట్ర సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరంలో బాండ్ల అమ్మకం ద్వారా ఆర్బీఐ నుంచి తీసుకునే అప్పుల్లో కోత పడింది. రూ.53 వేల కోట్లలో రూ.15 వేల కోట్లు కేంద్రం కోత విధించినట్లు ఇటీవల సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో పాటు ప్రాజెక్టులు, సహా ఇతరాల కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు పూర్తిగా నిలిచిపోయాయి. నిధుల సర్దుబాటుకు  ప్రత్యామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై కేబినెట్లో చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వ భూముల అమ్మకం, రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయాలు ప్రభుత్వం చేపట్టింది.

భూముల ధరలు సవరించి.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచింది. ఇప్పుడు ఇంకా ఎక్కడెక్కడ భూములు అమ్మాల్సి ఉంది? పన్నుల ద్వారా ఆదాయం ఎలా సమకూర్చుకోవాలనే దానిపై కేబినేట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త పెన్షన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథ పిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల సహా ఇతర అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న అసెంబ్లీ స్పెషల్ సెషన్ పై చర్చించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో మునుగోడు బై ఎలక్షన్, పార్టీ వ్యూహం, సంబంధిత అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.