హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాలోని మేడారానికి తరలుతున్నది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అక్కడి హరిత హోటల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.మంత్రులందరూ, ఆయా శాఖల సెక్రెటరీలు కూడా కేబినెట్ మీటింగ్‌కు అటెండ్ కానున్నారు. దీంతో రెండు రోజులపాటు ప్రభుత్వం మొత్తం సమక్క–సారక్కల సన్నిధి నుంచి వ్యవహారాలు నిర్వహించనున్నట్లు ప్రభు త్వవర్గాలు పేర్కొంటున్నాయి.
ఖమ్మంలో ఆదివారం సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు సీఎం హాజరవుతారు. ఖమ్మం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రులతో కలిసి సీఎం మేడారం బయలుదేరుతారు. ఇక దక్షిణ భారతదేశ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ఏర్పాట్లు, గిరిజనుల సంక్షేమం కోసం ఈ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.
ప్రధానంగా ములుగు జిల్లాలో దాదాపు 14 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పొట్లాపూర్ ఎత్తిపోతల పథకంపై నిర్ణయం తీసుకోనున్నారు. దేవాదుల ప్యాకేజీ 3 పనులకు ఆమోదం తీసుకుంటారని తెలిసింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం.. రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో ఈ ఎన్నికలపైనా కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
వచ్చే ఏడాదిలో రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఆ తర్వాత 2028లో కృష్ణా పుష్కరాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు పుష్కరాలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, ఘాట్ల నిర్మాణం, ఇతరత్రా వంటి వాటిపై కేబినెట్‌లో చర్చిస్తారని తెలిసింది. ఇక యాసంగి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పంపిణీ చేయాల్సి ఉంది.
జనవరి నెల ముగింపునకు వచ్చిన నేపథ్యంలో ఎప్పటి నుంచి రైతు భరోసా ఇవ్వాలనే దానిపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సెక్రటేరియెట్ వర్గాలు వెల్లడించాయి. హ్యామ్రోడ్లపై కూడా మంత్రివర్గ ఆమోదం తీసుకోనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా ఇటీవల ఎన్టీవీలో ప్రసారమైన మంత్రి, ఒక ఐఏఎస్‌కు సంబంధించిన కథనంపై కేబినెట్‌లో సీఎం చర్చిస్తారని తెలుస్తున్నది. కేబినెట్ భేటీ తర్వాత మేడారంలో గిరిజనులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం వీక్షిస్తారు.
10 రోజులపాటు సీఎం విదేశీ పర్యటన
రెండేండ్లకోసారి జరిగే మహాజాతర నేపథ్యంలో మేడారం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లతో శ్రీకారం చుట్టింది. రూ.150 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించి, శాశ్వత పనులు చేపట్టింది. రూ.101 కోట్లతో గద్దెల ప్రాంగణాన్ని గ్రానైట్ శిలలతో పునర్నిర్మించింది. పనులు తుది దశకు చేరడంతో ఈ నెల 19న సోమవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఉదయం6 గంటల నుంచి 7 .30 గంటల మధ్య పూజలు చేసి, మేడారం గద్దెల వద్ద పలు ప్రారంభోత్సవాలు జరుపుతారు.
ఈ కార్యక్ర మంలో 5 వేల మంది స్వయం సహాయక మహిళా గ్రూప్ సభ్యులకు అవకాశం కల్పిస్తున్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. దావోస్ పర్యటనతోపాటు వారం రోజులపాటు ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బోస్టన్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు వెళ్తున్నారు. దీంతో ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనలో ఉంటారు.
