మే 30న కేబినెట్‌‌ భేటీ.. లాక్​డౌన్​ను పొడిగించే చాన్స్​

మే 30న కేబినెట్‌‌ భేటీ.. లాక్​డౌన్​ను పొడిగించే చాన్స్​
  • 30న కేబినెట్‌‌ భేటీ
  • కరోనా, లాక్‌‌డౌన్‌‌, పంట కొనుగోళ్లు, వానాకాలం సీజన్‌‌పై చర్చ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర కేబినెట్‌‌ ఈ నెల 30న భేటీ కానుంది. అదే రోజుతో రాష్ట్రంలో లాక్‌‌డౌన్‌‌  ముగుస్తుండటంతో కరోనా వైరస్‌‌ తీవ్రత, లాక్‌‌డౌన్‌‌  కొనసాగింపుపై  సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. 30న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌‌లో కేబినెట్‌‌ సమావేశం ఉంటుందని బుధవారం సీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది. యాసంగి పంటల కొనుగోళ్లు, రానున్న వానాకాలం సీజన్‌‌కు విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాలు నిరోధించడంపైనా సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నెల 11న సమావేశమైన కేబినెట్​ ఆ మరుసటి రోజు నుంచి లాక్‌‌డౌన్‌‌ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తిరిగి 20న సమావేశమై లాక్​డౌన్​ కొనసాగింపుపై చర్చించాలనుకుంది. అయితే.. 18న సీఎం కేసీఆర్‌‌ లాక్‌‌డౌన్‌‌ ఇంకో తొమ్మిది రోజులు పొడిగిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. 20న నిర్వహించాల్సిన కేబినెట్‌‌ భేటీని రద్దు చేశామని పేర్కొన్నారు. మంత్రులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

లాక్​డౌన్​ను పొడిగించే చాన్స్​
మరోసారి లాక్‌‌డౌన్​ను పొడిగించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు మినహాయింపు ఉండగా, మినహాయింపు టైంను కూడా పొడిగించే అంశంపైనా కేబినెట్‌‌లో చర్చించనున్నట్టు సమాచారం.

వరి సాగు 41 లక్షల ఎకరాలకే పరిమితం!
వానాకాలం పంట సీజన్‌‌ మొదలు కానుండటంతో వ్యవసాయ రంగంపైనా కేబినెట్​ భేటీలో కీలక చర్చ జరగనుంది. వానాకాలం సీజన్‌‌లో రాష్ట్ర వ్యాప్తంగా 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశముందని అంచనా వేశారు. ఇందులో వరిసాగును 41 లక్షల ఎకరాలకే పరిమితం చేసి, ప్రత్యామ్నాయంగా పత్తి, కంది పంటలను ప్రోత్సహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై కేబినెట్​లో చర్చించనున్నారు.  యాసంగి సీజన్‌‌లో పండిన ధాన్యంలో ఇప్పటికే 76 శాతం పంటను కొనుగోలు చేసినట్టుగా సివిల్‌‌ సప్లయ్స్ కార్పొరేషన్‌‌ ప్రకటించింది. ఇంకో పది రోజుల్లో మిగిలిన ధాన్యం కొంటామని ప్రకటించినా, ఆచరణలో మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. అప్పటికే వర్షాలు మొదలైతే కొన్న ధాన్యం తరలింపునకు ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిపైనా కేబినెట్​ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.