ఎరువుల సబ్సిడీకి రూ.1.08 లక్షల కోట్లు

ఎరువుల సబ్సిడీకి రూ.1.08 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది (2023–24) ఖరీఫ్​  సీజన్ కు ఎరువుల సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం రూ.1.08 లక్షల కోట్లు ఖర్చుపెట్టనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరల్లోనే రైతులకు ఎరువులు దొరికేలా చూస్తామని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్  మాండవీయ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్ సమావేశమైంది. సమావేశం తర్వాత మీడియాతో మన్సుఖ్  మాట్లాడారు. ఫాస్ఫేటిక్, పొటాసిక్  (పీ అండ్ కే) ఎరువులకు రూ.38 వేల కోట్ల రాయితీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్  నిర్ణయించిందని ఆయన వెల్లడించారు.

దీంతో ఈ ఏడాది ఖరీఫ్​ సీజన్​కు మొత్తం ఎరువుల సబ్సిడీపై ఖర్చు రూ.1.08 లక్షల కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. ఈ రాయితీతో దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి కలుగుతుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో ఖరీఫ్  సీజన్  కోసం రూ.70 వేల కోట్లు కేటాయించారని ఆయన గుర్తుచేశారు. అలాగే ఎరువుల గరిష్ట చిల్లర ధరలో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం యూరియా ధర బస్తాకు రూ.276, డీఏపీ ధర బస్తాకు రూ.1350గా ఉంది.