వరంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేడర్ అసంతృప్తి

వరంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేడర్ అసంతృప్తి

వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ లీడర్లు, కేడర్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేలు నోటి దురుసుతో దగ్గరోళ్లను దూరం చేసుకుంటున్నారు. దీంతో మొన్నటిదాకా వెంట నడిచిన లీడర్లు ఇప్పుడు వేరే గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంలో సిట్టింగులు ఘోరంగా విఫలమయ్యారు.  పోయిన ఎలక్షన్లలో ఓటర్ల వద్ద తెలంగాణ సెంటిమెంట్ బలంగా పనిచేసినా ఈసారి ఆ వాతావరణం కనిపించడం లేదు. అదే టైంలో అపొజిషన్ లీడర్లు సై అంటే సై అంటున్నారు మూడు నియోజకవర్గాల్లోనూ జనాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతోంది. ప్రధానంగా రెండుచోట్ల సిట్టింగుల గ్రాఫ్ పడిపోయింది. మరోచోట రిజర్వేషన్ కలిసివస్తోంది. 

నన్నపునేనికి.. ఇంటా బయట పోటీ 

గ్రేటర్ సిటీ పరిధిలో ఉండే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్​కు సొంత పార్టీతో పాటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర పోటీ ఉంది. రాజకీయాల్లో మిగతావారితో పోలిస్తే జూనియర్ అయిన ఎమ్మెల్యే నరేందర్.. సీనియర్ నేతలను ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించడం ఆయనకు చాలా మైనస్ అవుతోంది. నియోజకవర్గంలో సొంత పార్టీలోని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణిలను ఎమ్మెల్యే ఏ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. ఇరువురూ ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్ఆశిస్తున్నారు. దీంతో వారు వేరే గ్రూపులుగా ఉన్నారు. ఈ క్రమంలో కేడర్ అలానే విడిపోయారు. నరేందర్​తో పోరు పడలేకనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్​రావు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 

ఓ విధంగా బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచేందుకు సై అంటే సై అంటున్నారు. ఎమ్మెల్యే నోటి దురుసు కారణంగానే నేతలు దూరమవుతున్నారని సీనియర్ ​లీడర్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఆపై కారు పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తూర్పు టిక్కెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కొండా సురేఖ ఈసారి కాంగ్రెస్​పార్టీ నుంచి వరంగల్ తూర్పు బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఏటా వానాకాలంలో పదుల సంఖ్యలో కాలనీలు మునుగుతున్నా.. 2018లో ఇచ్చిన శాశ్వత చర్యల హామీ నెరవేర్చడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారు. ఆరేండ్లు గడిచినా జిల్లాకు కొత్త కలెక్టరేట్​నిర్మించలేకపోయారు. వరంగల్ జిల్లా పాలన మొత్తం హనుమకొండ జిల్లా నుంచే నడుస్తోంది.  

నర్సంపేటలో.. హామీలు నెరవేరలే 

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి ఇచ్చిన హామీలను తీర్చడంలో ఫెయిల్ అయ్యారనే విమర్శ ఉంది. రాష్ట్రం మొత్తంలో కనీసం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వని నియోజకవర్గాల్లో నర్సంపేట ఉంది. సుదర్శన్​రెడ్డి అనుచరులు, పార్టీ మండల అధ్యక్షుల హోదాలో ఉన్నవారు నయీం ముఠా భూకబ్జాల్లో జైలుకు వెళ్లారు. నర్సంపేట పట్టణ పరిధిలో భూకబ్జాల్లోనూ ఆయన అనుచరులే ఉన్నారు. లాయర్ మల్లారెడ్డి హత్య కేసులోనూ వారే ఉన్నారు. ఇవన్నీ పోలీస్ స్టేషన్ కేసులు, జైలు శిక్షల వరకు వెళ్లగా.. సెటిల్మెంట్ ఇష్యూలు మరెన్నో ఉన్నాయి. పెద్ది నోటి దురుసుతనానికి తోడు ఎమ్మెల్యే భార్య జడ్పీటీసీ పెద్ది స్వప్న సమాంతర రాజకీయాలు చేయడం నెగటివ్ అవుతోందనే భావన పార్టీలో నెలకొంది. దీనిని అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, బీజేపీ నుంచి సీనియర్ నేత రేవూరి ప్రకాశ్​రెడ్డి నియోజకవర్గంలో బలాన్ని పెంచుకుంటున్నారు.

వర్ధన్నపేటలో.. అరూరి టిక్కెట్​పై సందిగ్ధం  

రాష్ట్రంలో అత్యధిక రెండో మెజార్టీతో వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అరూరి రమేశ్ విషయంలో కేడర్ డిసప్పాయింట్లో ఉంది. దేవాదుల ప్రాజెక్ట్​ నీటిని నష్కల్, ఉప్పుగల్లు, రామారం, దివిటిపల్లి, దమ్మన్నపేట మీదుగా వర్ధన్నపేట చెరువులోకి తీసుకొస్తానన్న హామీ నెరవేరలేదు. 100 పడకల హాస్పిటల్ ​రాలేదు. నిత్యం ఏదో ఒకచోట డబుల్​బెడ్రూం ఇండ్ల విషయమై ఎమ్మెల్యేను నిలదీస్తున్నారు. దళితబంధు కేవలం అనుచరులకే ఇప్పించుకున్నాడని దళితులు ఆగ్రహంతో  ఉన్నారు. నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగ్ చేసే క్రమంలో ఎమ్మెల్యేను నిలదీసిన బాధితులను పోలీసులు స్టేషన్​లో పెట్టి థర్డ్​డిగ్రీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే అనుచరులైన కార్పొరేటర్లపై భూకబ్జాలు, రౌడీల మరకలున్నాయి. కాగా, రాబోయే ఎన్నికల్లో రమేశ్​కు టిక్కెట్ కేటాయించే విషయమై వివిధ రకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. బీఆర్ఎస్ పెద్దలు ఈసారి అరూరిని వరంగల్ ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సామాజికవర్గానికి చెందిన ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్​ను వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. జిల్లాలో పనిచేసి ప్రస్తుతం కల్వకుంట్ల కుటుంబానికి చెందినవారి జిల్లాలో పనిచేస్తున్న ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ పేరు సైతం వినపడుతోంది.  

పుంజుకున్న అపొజిషన్ పార్టీలు

వరంగల్​తూర్పు, నర్సంపేటలో ఎమ్మెల్యేలపై సొంత పార్టీ కేడర్​ కొంత నిరాశలో ఉండగా.. తూర్పులో  బీఆర్ఎస్​ నుంచి బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్​రావు ఎప్పటినుంచో ఎమ్మెల్యేకు పోటాపోటీగా జనాల్లోకి వెళుతున్నారు. నర్సంపేటలో కాంగ్రెస్​ తరఫున దొంతి మాధవరెడ్డి, బీజేపీ నుంచి రేవూరి ప్రకాశ్​రెడ్డి తమదైన స్టైల్​లో గ్రౌండ్​వర్క్ చేసుకుంటున్నారు. వర్ధన్నపేటలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, కాంగ్రెస్​ నుంచి నమిండ్ల శ్రీనివాస్​ పోటీకి  ఆసక్తిగా ఉన్నారు.

2018 ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు

వరంగల్​తూర్పు నియోజకవర్గం

నన్నపునేని నరేందర్(బీఆర్ఎస్)     83,922
వద్దిరాజు రవిచంద్ర (కాంగ్రెస్)          55,140
కుసుమ సతీశ్(బీజేపీ)                        4,729
వర్ధన్నపేట నియోజకవర్గం
అరూరి రమేశ్(బీఆర్ఎస్)                  1,31,252
పగిడిపాటి దేవయ్య(టీజేఎస్)            32,012
చిలుముల్ల లెనిన్( సీపీఐఎంల్)       6,367 
కొత్త సారంగరావు(బీజేపీ)                    6,114
నర్సంపేట నియోజకవర్గం    
పెద్ది సుదర్శన్​రెడ్డి(బీఆర్ఎస్)         94,135
దొంతి మాధవరెడ్డి(కాంగ్రెస్)             77,186
ఎన్.నాగేశ్వరరావు(ఇండిపెండెంట్)    9,025