నేడు పార్లమెంటు రాఫెల్ పై కాగ్​ రిపోర్టు

నేడు పార్లమెంటు రాఫెల్ పై కాగ్​ రిపోర్టు
  • ప్రవేశపెట్టనున్న కేంద్రం.. ధరల ప్రస్తావన లేకుండానే నివేదిక?

న్యూఢిల్లీ: పొలిటికల్ ఫైటింగ్​కు కేంద్ర బిందువుగా మారిన రాఫెల్ డీల్ పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్​) సిద్ధం చేసిన రిపోర్టును కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనునుంది. అధికారికంగా ‘క్యాపిటల్ అక్విజిషన్స్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్’గా పిలిచే ఈ రిపోర్టును బడ్జెట్ సమావేశాలు ముగియడానికి ఒక్క రోజు ముందు సభ ముందుకు తెస్తుండటం గమనార్హం. ఫిబ్రవరి 13న(బుధవారం) జరగే సమావేశమే16వ లోక్​సభకు చివరిది. కాబట్టి కాగ్​ రిపోర్టుపై పార్లమెంట్ లో సుదీర్ఘ చర్చ కష్టమే. పైగా రిపోర్టుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తొలి నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుత కాగ్​ రాజీవ్ మహర్షి గతంలో ఫైనాన్స్ సెక్రటరీగా
పనిచేసిన కాలంలోనే రాఫెల్ ఒప్పందం కుదిరిందని, ఆయన ఆమోదిం చిన ఒప్పందంలో మళ్లీ
ఆయనే తప్పులు గుర్తిస్తారన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీకి లేదని ఎంపీ కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. నేడు విడుదల కానున్న కాగ్​ రిపోర్టులో రాఫెల్ ధరల ప్రస్తావన ఉండకపోవచ్చని పార్లమెంట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.