వావ్... ఒక్క కౌగిలింత.. బ్యాంకు దోపిడీని ఆపేసింది

వావ్... ఒక్క కౌగిలింత.. బ్యాంకు దోపిడీని ఆపేసింది

"ఒక చిన్న నవ్వు నవ్వి యుద్దాలు కూడా ఆపొచ్చు" అంటారు కదా.. అలాగే "ఓ హగ్ తో బ్యాంక్ దోపిడీ ఆగిపోయింది". విచిత్రంగా ఉంది కదా.. వినేందుకు ఆశ్చర్యంగా అనిపించినా.. నిజంగానే ఓ కౌగిలింతతో బ్యాంకులో దోపిడీ ఆగిపోయింది.

మైఖేల్ ఆర్ముస్ అనే ఓ సీనియర్ కాలిఫోర్నియాలోని సిటిజన్ బ్యాంక్ ఆఫ్ ది వెస్ట్‌లో చెక్ డిపాజిట్ చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 42 ఏళ్ల ఎడ్వర్డో ప్లేసెన్సియా అనే వ్యక్తి తనకు డబ్బులు కావాలని ఇవ్వకపోతే.. తన వద్ద పేలుడు పదార్ధాలు ఉన్నాయని బ్యాంకు సిబ్బందిని బెదిరించడం మొదలుపెట్టాడు. అతని వాయిస్ విన్నఆర్ముస్‌.. అతడు తన ఇంటి ఎదురుగా ఉండే వ్యక్తిగా గుర్తించాడు. అంతేకాకుండా అతనిని ముఖం చూస్తే తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నట్లు కనిపించాడు. ఓసారి అతనిని దగ్గరకు వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకుని దగ్గరకు తీసుకుని హగ్ ఇవ్వాలని అనుకున్నాడు.

ఆర్ముస్ అతని దగ్గరకు వెళ్లి ‘నీకు ఏమైంది ? జాబ్ లేదా ?’ అని ప్రశ్నించాడు. ‘నాకోసం ఈ పట్టణంలో ఏమీ లేదు. అందుకే జైలుకి వెళ్లాలని అనుకుంటున్నాను’ అని ప్లేసెన్సియా చెప్పాడు. అతని సమాధానం విన్న ఆర్ముస్.. పోలీసులు వచ్చేలోపు బ్యాంకు బయటకు తీసుకువెళ్లి ఒకసారి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అంతే ప్లేసెన్సియా ఏడవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... దోపిడీకి ప్రయత్నించినందుకు గానూ ప్లేసెన్సియాను అరెస్టు చేసి జైలుకి తరలించారు. అయితే అతని వద్ద ఎటువంటి పేలుడు పదార్ధాలు పోలీసులకు దొరకలేదు. ఆ తర్వాత పోలీసులు ఆర్ముస్‌ను ప్రశంసించారు.