- 'ఇయరెండిల్-1'పేరిట తొలి శాటిలైట్ లాంచ్ కు సన్నాహాలు
- ప్రయోగం సక్సెస్ అయితే స్విగ్గీలో ఫుడ్ లాగే భవిష్యత్తులో సన్ లైట్ ఆర్డర్!
- గంటకు రూ.4.6 లక్షల ఖర్చుతో సూర్యరశ్మి సప్లయ్
- నైట్ టైంలో భూమిపైకి వెన్నెల కంటే ఎక్కువ ఎండ కంటే తక్కువ లైట్
- పక్షులు, జంతువుల జీవనశైలి దెబ్బతినే ప్రమాదం ఉందంటున్న ఎక్స్ పర్ట్స్
న్యూఢిల్లీ: ప్రకృతి నియమం ప్రకారం సూర్యుడు అస్తమిస్తే చీకటి పడాల్సిందే. కానీ, మనిషి మేధస్సు ఇప్పుడు ప్రకృతి నియమాన్నే సవాల్ చేస్తోంది. అవును, అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 'రిఫ్లెక్ట్ ఆర్బిటాల్' అనే స్టార్టప్ కంపెనీ రాత్రిపూట కూడా సూర్యరశ్మిని(సన్ లైట్ ఎట్ నైట్) భూమిపైకి తీసుకొచ్చే ఓ అద్భుతమైన, వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ ఆలోచన సక్సెస్ అయితే స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసినట్లుగా..ఒక యాప్ ద్వారా మనకు కావలసిన చోట సన్ లైట్ ఆర్డర్ చేసుకోవచ్చు.
అద్దాలతో మాయాజాలం
సన్ లైట్ ఎట్ నైట్ ప్రాజెక్టు వెనుక ఉన్న టెక్నాలజీ వినడానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. భూమికి పైన దాదాపు 600 నుంచి 625 కిలోమీటర్ల ఎత్తులో (సన్-సింక్రోనస్ ఆర్బిట్) కొన్ని ప్రత్యేక శాటిలైట్లను రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ కంపెనీ ప్రవేశపెట్టనుంది. ఈ శాటిలైట్లకు 10 నుంచి 54 మీటర్ల వెడల్పు ఉండే భారీ అద్దాలను అమరుస్తారు. ఈ అద్దాలు అత్యంత తేలికైన 'మైలార్'అనే పదార్థంతో తయారవుతాయి. భూమిపై రాత్రి ఉన్న టైంలో మైలార్ అద్దాలు సూర్యుడి కాంతిని స్వీకరించి సరిగ్గా మనం కోరుకున్న ప్రదేశానికి రిఫ్లెక్ట్ చేస్తాయి.
దీన్ని ఒక రకమైన "స్పేస్ టార్చ్ లైట్" అని పిలవవచ్చు. అయితే, ఇది పగటిపూట ఉండే ఎండ అంత తీవ్రంగా ఉండదు. దీని ప్రకాశం 0.8 నుంచి 2.3 లక్స్ మధ్య ఉంటుంది. అంటే ఇది పౌర్ణమి నాటి వెన్నెల కంటే కొంచెం ఎక్కువ వెలుతురును ఇస్తుంది. మరో విషయమేమిటంటే ఒక శాటిలైట్ ఒకేసారి 5 కిలోమీటర్ల మేర వెలుతురును కేవలం 4 నిమిషాల పాటు మాత్రమే ఇవ్వగలదు. రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ కంపెనీ ఈ ఏడాది చివరలో 'ఇయరెండిల్-1'పేరిట తొలి ప్రయోగాత్మక శాటిలైట్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ " స్పేస్ టార్చ్ లైట్" భూమిపై ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి!
ఒక గంట వెలుతురుకు రూ.4.6 లక్షలు
సన్ లైట్ ఎట్ నైట్ సర్వీసును రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ కంపెనీ పారిశ్రామిక అవసరాల కోసం రూపొందిస్తున్నది. సూర్యాస్తమయం తర్వాత సోలార్ ప్యానెల్స్ పనిచేయవు. కానీ, మైలార్ అద్దాల ద్వారా రాత్రి కూడా సోలార్ ప్యానెల్స్ పై కాంతి పడేలా చేస్తే 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అలాగే, మారుమూల ప్రాంతాల్లో రాత్రి వేళల్లో జరిగే మైనింగ్ , నిర్మాణ పనులకు వెలుతురును అందించవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి కరెంటు నిలిచిపోయిన చోట, సహాయక చర్యల కోసం కూడా ఈ వెలుతురు ప్రాణవాయువులా పనిచేస్తుంది.
అయితే, ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండేంత చౌకైనది మాత్రం కాదు. ఒక గంట వెలుతురు కావాలంటే సుమారు 5 వేల డాలర్లు (సుమారు రూ.4.6 లక్షలు) ఖర్చవుతుంది. అంతేకాకుండా, ఏడాదికి కనీసం 1,000 గంటల పాటు ఈ సర్వీసును వాడుకుంటామని రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ తో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ప్రభుత్వాలకు, భారీ కంపెనీలకు మాత్రమే సాధ్యమవుతుంది. అంత ఖరీదైనప్పటికీ, దాదాపు 2.6 లక్షల మంది ఇప్పటికే తమకు రాత్రిపూట సన్ లైట్ కావాలని ఆసక్తి చూపుతుండటం విశేషం.
సవాళ్లు, ఆందోళనలేమిటంటే..
ఈ ప్రాజెక్టు ఎంత ఆకర్షణీయంగా ఉందో అంతే వివాదాస్పదంగా కూడా మారింది. సన్ లైట్ ఎట్ నైట్ సర్వీసు వల్ల రాత్రి పూట ఆకాశం ప్రకాశవంతంగా మారితే టెలిస్కోపుల ద్వారా సుదూర నక్షత్రాలను పరిశోధించే ఖగోళ శాస్త్రవేత్తలకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే, రాత్రి పూట తిరిగే జంతువులు, పక్షులు ఈ కృత్రిమ వెలుతురు వల్ల అయోమయానికి గురై, వాటి ఆహార అన్వేషణ, సంతానోత్పత్తి చక్రం దెబ్బతినే ప్రమాదమూ ఉంది.
వేల సంఖ్యలో శాటిలైట్లను పంపడం వల్ల అంతరిక్షంలో 'స్పేస్ జంక్' పెరిగిపోయే అవకాశం ఉందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సైన్స్ పరంగా సూర్యరశ్మిని రిఫ్లెక్ట్ చేయటం సాధ్యమే అయినా.. దానిని పర్యావరణానికి నష్టం కలగకుండా, తక్కువ ఖర్చుతో అమలు చేయడం అతిపెద్ద సవాలుగా మారనుంది. ఈ వినూత్న ఆలోచన.. సిద్ధాంతం నుంచి వాస్తవ రూపంలోకి ఎలా మారుతుందో అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
