హైదరాబాద్​లో కాల్ సెంటర్లు.. అమెరికాలో మోసాలు

హైదరాబాద్​లో కాల్ సెంటర్లు.. అమెరికాలో మోసాలు

 

  • హైదరాబాద్​లో కాల్ సెంటర్లు.. అమెరికాలో మోసాలు
  • అమెరికన్లను దోచుకుంటున్న రెండు ముఠాలు  
  • మాదాపూర్ కేంద్రంగా దందా 
  • వేలాది మంది బాధితులు.. ఒక్కొక్కరి నుంచి ఐదారు వేల డాలర్లు వసూలు 
  • ఆరుగురు నిర్వాహకులు సహా 115 మంది అరెస్టు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  మూడు ఫేక్ కాల్ సెంటర్లు పెట్టి వేలాది మంది అమెరికన్లను దోచుకున్న రెండు ముఠాలను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిర్వాహకులు, 109 మంది టెలీకాలర్లను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.2.55 లక్షలు, 130 సీపీయూలు, 120 సెల్‌‌‌‌ఫోన్స్, ఆడి కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం వెల్లడించారు. గుజరాత్‌‌‌‌కు చెందిన మహ్మద్‌‌‌‌ అన్సారీ మొహిర్ఫన్‌‌‌‌, ఘంచీ అకీబ్‌‌‌‌.. అక్కడ ఏఆర్‌‌‌‌‌‌‌‌జే, ఏజీ సొల్యూషన్స్‌‌‌‌ పేరుతో సాఫ్ట్‌‌‌‌వేర్ కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నారు. రెండేండ్ల కింద హైదరాబాద్ మాదాపూర్ లోని విఠల్‌‌‌‌రావు నగర్‌‌‌‌‌‌‌‌లో ఆ కంపెనీల పేరుతో రెండు ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.  ఏపీ, తెలంగాణ సహా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యా నా, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన 88 మంది యువతీ యువకులను టెలీకాలర్స్‌‌‌‌గా నియమించారు. ఇంగ్లిష్ బాగా మాట్లాడేవారిని ఎంపిక చేశారు. 

ఇట్ల ట్రాప్..  

‘కాల్‌‌‌‌సెంటర్స్‌‌‌‌ఇండియా.కామ్‌‌‌‌’ అనే పోర్టల్‌‌‌‌ నుంచి అమెరికా, కెనడాకు చెందినోళ్ల ఫోన్‌‌‌‌ నంబర్లు, పర్సనల్‌‌‌‌ డేటాను నిందితులు కొనుగోలు చేశారు. అమెరికన్లను ట్రాప్ చేసే విధంగా టెలీకాలర్స్‌‌‌‌కు ట్రైనింగ్ ఇచ్చారు. టెలీకాలర్స్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్‌‌‌‌ (వీఓఐపీ) ద్వారా అమెరికన్లకు కాల్స్ చేసేవారు. అమెరికా కస్టమ్స్, బార్డర్ ప్రొటెక్షన్ సెల్ నుంచి కాల్స్ చేస్తున్నట్టుగా నమ్మించేవారు. వ్యక్తిగత వివరాలన్నీ చెప్పడంతో బాధితులు కూడా నిజమేనని నమ్మేవారు. ‘‘మీకు మెక్సికో నుంచి ఓ పార్సిల్ వచ్చింది. అందులో డ్రగ్స్‌‌‌‌ సహా నిషేధిత వస్తువులు ఉన్నాయి. మీరు మెక్సికో, కెనడా, కొలంబియాకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. మిమ్మిల్ని అరెస్టు చేయడానికి మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు” అని బాధితులను బెదిరించేవారు. ఇది నిజమేనని నమ్మి ట్రాప్ లో పడ్డోళ్లతో బేరం మాట్లాడేవారు. 

వోచర్లు సేకరించి.. క్రిప్టో కరెన్సీగా మార్చి.. 

వచ్చిన పార్సిల్ క్యాన్సిల్ చేస్తామని, అందుకు ఐదారు వేల డాలర్లు ఖర్చవుతుందని బాధితులకు చెప్పేవారు. ఒప్పుకున్నోళ్లను ఆపిల్, అమెజాన్ వోచర్స్, ఆన్ లైన్ గిఫ్ట్ కార్డులు పంపించమని చెప్పేవారు. అమెరికన్ల నుంచి సేకరించిన వోచర్ల కోడ్స్ అన్సారీ, అకీబ్‌‌‌‌కు చేరేవి. వాళ్లు వాటిని ‘పాక్స్‌‌‌‌ఫుల్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్’లో సేల్ చేసేవారు. డాలర్లను క్రిప్టో కరెన్సీగా మార్చుకునేవారు. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకునేవారు. అట్ల మార్చుకున్న మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా తమ అకౌంట్లలోకి జమ చేసుకునేవారు. 

అమెజాన్ ఆర్డర్స్ పేరుతో.. 

అన్సారీ, అకీబ్‌‌‌‌ తరహాలోనే మరో ముఠా కూడా అమెరికన్లను దోచుకుంది. అహ్మదాబాద్‌‌‌‌కు చెందిన ప్రదీప్‌‌‌‌ వినోద్‌‌‌‌ రాథోడ్‌‌‌‌, ముంబైకి చెందిన ఉస్మాన్ ఘనీ ఖాన్‌‌‌‌, శివం ప్రధాన్‌‌‌‌, నాగాలాండ్‌‌‌‌కు చెందిన దీపు థాపర్‌‌‌‌‌‌‌‌ కలిసి వర్టేజ్ సొల్యూషన్స్‌‌‌‌ పేరుతో ఫేక్ కాల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. టెలీకాలర్స్ అమెరికన్లకు ఫోన్ చేసి.. ‘మీ పేరుపై అమెజాన్ డెలివరీ వచ్చింది’ అని చెప్పేవారు. తాము ఆర్డర్ చేయలేదని బాధితులు చెప్తే.. క్యాన్సిల్ చేస్తామని నమ్మించేవారు. అయితే అందుకు కొంత ఫైన్ పడుతుందని చెప్పేవారు. గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయించేవారు. ఆ తర్వాత ఆ డబ్బులను ఇండియన్ కరెన్సీలోకి మార్చి, అకౌంట్లలో వేసుకునేవారు. 

ఇట్ల దొరికిన్రు.. 

అమెరికాలో బాధితులు పెరిగిపోవడంతో, అక్కడి ఏజెన్సీలు హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చాయి. మాదాపూర్ కేంద్రంగా ఫేక్ కాల్‌‌ సెంటర్లు నడుపుతున్నారని గుర్తించిన సైబరాబాద్ పోలీసులు.. ఏఆర్‌‌‌‌జే, ఏజీ సొల్యూషన్స్‌‌పై దాడి చేశారు. వాటికి సమీపంలోనే ఉన్న వర్టేజ్‌‌ సొల్యూషన్స్‌‌లోనూ సోదాలు జరిపారు. ఆ మూడు కంపెనీలూ సైబర్ మోసాలు చేస్తున్నట్టు గుర్తించారు. ఆరుగురు నిర్వాహకులు సహా 115 మందిని అరెస్టు చేశారు. ఈ కాల్ సెంటర్లపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నిందితులను కస్టడీకి తీసుకుని పూర్తి వివరాలు సేకరిస్తామని వెల్లడించారు.