
ఓ థియేటర్ లో బాంబు ఉందంటూ అగంతకుడు చేసిన ఫోన్ కాల్ కలకలం సృష్టించిన సంఘటన మల్కాజిగిరి పోలిస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మన్మోహన్ యాదవ్ తెలిపిన వివరాలు.. మల్కాజిగిరి లోని సాయిరామ్ థియేటర్ లో బాంబు పెట్టారని శనివారం రాత్రి 9:30 గంటలకు పోలీసు కంట్రోల్ రూమ్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే మల్కాజిగిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏసీపీ సందీప్, సీఐ మన్మోహన్ యాదవ్ థియేటర్ లో సినిమా చూస్తున్న ప్రేక్షకులను బయటకు పంపి డాగ్ స్క్వాడ్ తో సోదాలు చేశారు. పోలీసులు ఎలాంటి బాంబు లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ మన్మోహన్ యాదవ్ మాట్లాడుతూ హెచ్చరించారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన అగంతకుడిని పట్టుకుంటామన్నారు.