పేరెంట్స్‌‌తో గొడవల్లేవు.. వాళ్ల అనుమతితోనే లండన్ వచ్చా​

పేరెంట్స్‌‌తో గొడవల్లేవు.. వాళ్ల అనుమతితోనే లండన్ వచ్చా​

పేరెంట్స్ తో ఎలాంటి గొడవలు లేవు.. కోచ్‌‌ గోపీకి కూడా చెప్పా-సింధు
సింధు ట్రెయినింగ్‌ పై గోపీచంద్ ఇంట్రస్ట్‌ చూపిస్తలే: రమణ
రెండు నెలలు ఇంగ్లండ్ టీమ్‌ తో స్టార్‌‌ షట్లర్‌‌ ప్రాక్టీస్‌‌ టెస్ట్‌

హైదరాబాద్‌‌: ఉదయం గచ్చిబౌలిలోని గోపీచంద్‌‌ అకాడమీలో ట్రెయినింగ్‌‌. సాయంత్రం సుచిత్రా అకాడమీలో శ్రీకాంత్‌‌ వర్మ  సమక్షంలో ఫిట్‌‌నెస్‌‌ సెషన్స్‌‌. చాన్నాళ్ల నుంచి సింధు డైలీ రొటీన్‌‌ ఇది. కానీ, గత పది రోజులుగా అమె రెండు అకాడమీలకు రావడం లేదు. అసలామె హైదరాబాద్‌‌లోనే లేదు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇక్కడి నేషనల్‌‌ క్యాంప్‌‌ను వీడి లండన్‌‌కు వెళ్లింది. అక్కడి గాటొరేడ్‌‌ స్పోర్ట్స్‌‌ సైన్స్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ (జీఎస్‌‌ఎస్‌‌ఐ)ను తన ట్రెయినింగ్‌‌ బేస్‌‌గా మార్చుకుంది. రెండు నెలల పాటు అక్కడే ఉండి ఇంగ్లండ్‌‌ బ్యాడ్మింటన్‌‌ టీమ్‌‌తో కలిసి శిక్షణ తీసుకోనుంది. సింధు పది రోజుల కిందటే లండన్‌‌ వెళ్లినప్పటికీ సోమవారం ఉదయం ఆమె ట్వీట్​ చేసే వరకూ ఈ విషయం ఎవ్వరికీ తెలియలేదు. పైగా, ఫస్ట్‌‌ టైమ్‌‌ పేరెంట్స్‌‌ లేకుండా ఒంటరిగా ఫారిన్‌‌ ట్రిప్‌‌కు వెళ్లింది. దాం తో, పేరెంట్స్‌‌తో గొడవ కారణంగానే ఆమె లండన్‌‌ వెళ్లిపోయిందన్న వార్తలు రావడం బ్యాడ్మింటన్‌‌ వరల్డ్‌‌ను షాక్‌‌కు గురి చేసింది.  అయితే, ఈ వార్తలను సింధు ఖండించింది. తన పేరెంట్స్‌‌తో గానీ,  కోచ్‌‌ గోపీచంద్‌‌తో గానీ ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడంతో పాటు గోపీకి సమాచారం ఇచ్చే లండన్‌‌ వచ్చానని మంగళవారం ట్వీట్‌‌ చేసింది. ‘నా న్యూట్రిషన్‌‌, రికవరీ విషయంలో జీఎస్‌‌ఎస్‌‌ఐతో వర్క్‌‌ చేసేందుకు కొన్ని రోజుల కిందటే నేను లండన్‌‌ వచ్చా. మా పేరెంట్స్‌‌ అనుమతితోనే ఇక్కడికి చేరుకున్నా. ఈ విషయంలో వారితో నాకు ఎలాంటి గొడవలు లేవు. అయినా నా కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మా పేరెంట్స్‌‌తో నాకు ప్రాబ్లమ్స్‌‌ ఎందుకు ఉంటాయి?  పైగా ఇంట్లో నన్ను చాలా గారాబంగా చూసుకుంటారు. ఎల్లప్పుడూ నాకు సపోర్ట్‌‌ ఇస్తారు.  వాళ్లతో నేను ప్రతి రోజూ మాట్లాడుతూనే ఉన్నా. అలాగే నా కోచ్‌‌ గోపీచంద్‌‌తో గానీ, అకాడమీలో ట్రెయినింగ్‌‌ ఫెసిలిటీస్‌‌ విషయంలో గానీ నాకు ఎలాంటి సమస్యలు లేవు’ అని చెప్పుకొచ్చింది.

రమణ కామెంట్స్‌‌పై  స్పందించను: గోపీ

తనపై సింధు తండ్రి చేసిన కామెంట్స్‌‌పై స్పందించేందుకు గోపీచంద్​ నిరాకరించాడు. ‘ఒకవేళ సింధు ఏమైనా చెబితే స్పందిస్తా గానీ, ఆమె తండ్రి చెప్పిన విషయాలపై నేను రెస్పాండ్‌‌ కాదలుచుకోలేదు. సింధు గాటొరేడ్‌‌ ట్రెయినింగ్‌‌ అకాడమీకి వెళ్లింది. మా దగ్గర ఉన్న సమాచారం ఇదే. సింధు పాల్గొనే ప్రోగ్రామ్‌‌ ఎన్ని రోజులు జరుగుతుందనే దాని గురించి పూర్తి వివరాలు నాకు తెలియదు’ అని గోపీపేర్కొన్నాడు.

గోపీ అకాడమీతో కటీఫ్‌‌?

కోచ్‌‌ గోపీతో ఎలాంటి సమస్యలు లేవని సింధు చెబుతున్నప్పటికీ ఆమె తండ్రి పీవీ రమణ వాదన మరోలా ఉంది. గోపీ అకాడమీలో నేషనల్‌‌ క్యాంప్‌‌లో ప్రాక్టీస్‌‌ సరిగ్గా జరగడం లేదన్నాడు. రెండేళ్ల నుంచి సింధు ట్రెయినింగ్‌‌ విషయంలో గోపీ శ్రద్ధ తీసుకోవడం లేదని ఆరోపించాడు. దాంతో, గోపీ అకాడమీకి సింధు పూర్తిగా గుడ్‌‌బై చెప్పే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇక్కడ (హైదరాబాద్‌‌) సింధు ప్రాక్టీస్‌‌ సరిగ్గా జరగడం లేదు. 2018 ఏషియన్‌‌ గేమ్స్‌‌ తర్వాత ఆమె ట్రెయినింగ్‌‌పై గోపీ ఇంట్రస్ట్‌‌ చూపించడం లేదు. ఆమెకు సరైన ప్రాక్టీస్‌‌ పార్ట్‌‌నర్‌‌ను ఇవ్వడం లేదు.  సింధుకు ఇక్కడ క్వాలిటీ ప్రాక్టీస్‌‌ దొరకడం లేదు. ఈ రకమైన ట్రీట్‌‌మెంట్‌‌తో ఆమె విసుగు చెందింది. అందుకే పది రోజుల కిందట లండన్‌‌ వెళ్లింది. ఆమెతోపాటు  మేం రెండు నెలలు అక్కడే ఉండలేం కాబట్టి ఒంటరిగా వెళ్లింది. అంతే తప్ప మా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవు.  అలాగే, ఈ ట్రిప్‌‌కు వారం ముందే బ్యాడ్మింటన్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (బాయ్‌‌)కు సింధు లెటర్‌‌ రాసింది. గోపీకి కూడా ఓ కాపీ పంపించింది’  అని రమణ చెప్పుకొచ్చాడు.