- రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
- ఉమ్మడి జిల్లాలో 317 గ్రామాల్లో సర్పంచ్ బరిలో 937 మంది..
- ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- ముగిసిన మూడో విడత నామినేషన్లను ఉపసంహరణ
ఖమ్మం /భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విడత ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దీంతో ఆ గ్రామాల్లో ఓటర్లను ప్రలోభపరిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓటర్లకు పైసలు, మద్యం పంపిణీ మొదలైంది. ఉమ్మడి జిల్లాలో 317 గ్రామాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతుండగా, సర్పంచ్ స్థానాల్లో 937 మంది బరిలో ఉన్నారు. ప్రచార గడువు ముగియడంతో ఓటర్లకు డబ్బులు, మద్యం పంపకంపై అభ్యర్థులు దృష్టి పెట్టారు.
ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వలస ఓటర్లను రప్పించేందుకు వారికి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తున్నట్టు తెలుస్తుంది. గ్రామాల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఓటుకు వెయ్యి నుంచి 2, 3 వేల వరకు కూడా డబ్బులు పంచుతున్నట్టు సమాచారం.
ఖమ్మం జిల్లాలో పరిస్థితి..
ఖమ్మం జిల్లాలో కొణిజర్ల, వైరా, రఘునాథపాలెం, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో 172 గ్రామ పంచాయతీలు, 1,740 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఉదయం పోలింగ్, మధ్యాహ్నం కౌంటింగ్ జరగనున్నాయి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 172 గ్రామాల్లో మొత్తం 2 లక్షల 41 వేల 137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇందులో ఒక లక్షా 16 వేల 384 మంది పురుష ఓటర్లు, లక్షా 24 వేల 743 మంది మహిళలు, ఇతరులు 10 మంది ఉన్నారు. మొదటి దశలో 192 గ్రామ పంచాయతీల్లో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 172 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నిక కోసం 488 మంది బరిలో ఉన్నారు. 1,740 వార్డులలో 2 వార్డులలో నామినేషన్లు దాఖలు కాలేదు. 323 వార్డులు ఏకగ్రీవం కాగా, 1,415 వార్డులలో 3,424 మంది పోటీలో ఉన్నారు.
మొదటి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 2,089 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉంచారు. 1,899 పోలింగ్ అధికారులు, 2,321 ఇతర పోలింగ్ అధికారులు నియమించారు. 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, 7 రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 36 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ గుర్తించారు. 360 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. 162 సెన్సిటివ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లు నియమించినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
ముగిసిన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ
మరో వైపు మూడో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను ఉపసంహరణ ముగిసింది. దీంతో పోరులో ఉండే అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. అయితే, ఎన్ని పంచాయతీ లలో ఏకగ్రీవాల అయ్యాయో ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్, భద్రాచలం, పినపాక, చర్ల, కరకుగూడ మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 159 గ్రామ పంచాయతీ లకు గాను 14 సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 145 సర్పంచ్ స్థానాలకు 461 మంది బరిలో ఉన్నారు. 1,097 వార్డులో 2,557 మంది బరిలో ఉన్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 1,428 పోలింగ్ స్టేషన్ల ను ఏర్పాటు చేశారు.
1.713 మంది పోలింగ్ ఆఫీసర్లు 2,295 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించి సాయం త్రంలోగా ఫలితాలను ప్రకటిస్తారు.

