ఆఖరి దశకు పంచాయతీ పోరు..మైకులు బంద్ .. పంపకాలు షురూ

ఆఖరి దశకు పంచాయతీ పోరు..మైకులు బంద్ .. పంపకాలు షురూ
  • ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం
  • బందైన మైకులు.. పంపకాలు షురూ
  • 3,752 సర్పంచ్​, 28,406 వార్డు 
  • స్థానాలకు రేపే పోలింగ్

హైదరాబాద్, వెలుగు:  పంచాయతీ పోరు చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే మొదటి విడత, రెండో విడత ఎన్నికలు  పూర్తికాగా.. చివరిదైన మూడో విడత ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. ఇన్ని రోజులు దరువులు, డప్పులు, మైకుల మోతతో దద్దరిల్లిన పల్లెలు.. ఇప్పుడు ‘సైలెంట్’ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. బహిరంగ ప్రచారం బంద్ కాగానే.. అభ్యర్థులు ‘అండర్ గ్రౌండ్’ ఆపరేషన్ షురూ చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడో దశ పోలింగ్​ బుధవారం జరుగనుంది. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు.  మంగళ వారం మండల  కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లనున్నారు. 

3,752 సర్పంచ్​, 28,406 వార్డులకు ఎన్నికలు

మూడో విడత పంచాయతీ ఎన్నికలు బుధవారం  జరుగనున్నాయి. ఈ విడతలో 4,157 పంచాయతీల్లోని 11 సర్పంచ్‌ పదవులకు.. 36,434 వార్డుల్లో 112 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 394 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మిగిలిన 28,406  వార్డులకు 75,283 మంది పోటీ పడుతున్నారు. 

పంపకాలు షురూ

మొదటి, రెండు దశల్లో పోలింగ్ సరళిని గమనించిన లీడర్లు అలర్ట్ అయ్యారు. ఆయా దశల్లో ఎక్కడైతే పంపిణీ సరిగ్గా జరగలేదో, అక్కడ ఫలితాలు తారుమారయ్యాయని గ్రహించారు. మొదటి, రెండో దశల లెక్కలు సరిచేసుకుంటూ అభ్యర్థుల వ్యూహాలకు పదునుపెట్టారు. ప్రచారం టైమ్ ముగియగానే.. కొందరు అభ్యర్థులు తమ అనుచరులను రంగంలోకి దింపారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, ఇండ్ల చుట్టూ తమ మనుషులను చక్కర్లు కొట్టిస్తున్నారు. ఓటుకు ఇంత అని రేటు కట్టి మరీ.. గుట్టుచప్పుడు కాకుండా పంపకాలు కానిచ్చేస్తున్నారు. మొదటి, రెండు విడతల్లో అక్కడక్కడ క్రాస్ ఓటింగ్ జరిగిందనే భయం అభ్యర్థులను వెంటాడుతున్నది. మన దగ్గర పైసలు తీసుకొని.. వేరేవారికి ఓటేస్తే ఎలా..?  అనే అనుమానం లీడర్లలో పెరిగిపోయింది. అందుకే ఈ మూడో విడతలో నమ్మకమైన ఓటర్లకే పైసలు పంపిణీ చేయాలనే వ్యూహంతో వెళ్తున్నారు. ముఖ్యంగా యూత్, మహిళా ఓటర్లు, కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ తోపాటు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వలస ఓటర్లకు ఫోన్లు చేసి, వచ్చి ఓటేసి పోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బస్సు చార్జీలతోపాటు ఓటుకు ఇంత చొప్పున ఆన్​లైన్​లో పంపిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కొన్నిచోట్ల వలస ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వాహనాలను పంపించి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

నేడు పోలింగ్ కేంద్రాలకు సామగ్రి

ఎన్నికల అధికారులు మూడో విడత పోలింగ్​ ఏర్పాట్లలో బిజీ అయ్యారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్సులు, పత్రాలు ఇతర ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. 

నేటి రాత్రే కీలకం

కొందరు అభ్యర్థులు వార్డులు, కాలనీలవారీగా బాధ్యులను నియమించి.. డబ్బులు పంపిణీని ముమ్మరం చేశారు.  పల్లెల్లో రాత్రివేళ మందు, విందు రాజకీయాలు జోరందుకున్నాయి. పోలింగ్‌‌‌‌కు ఇంకా కొన్ని గంటలే సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. పోలింగ్‌‌‌‌కు ముందు 48 గంటల సమయం అభ్యర్థులకు కీలకం కావడంతో ఓటు క్యాంపెయిన్ సీరియస్​గా తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి గెలుపు ఓటములను నిర్ణయిస్తుందని.. ఆ రాత్రికి ఏ ఓటరుకు ఎంత చేరవేయాలని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రత్యర్థి వర్గం ఎవరికి ఎర వేస్తున్నదని ఆరా తీస్తున్నారు. చివరి నిమిషంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.