బీఆర్ఎస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్టే : కాంపెల్లి శ్రీనివాస్ 

బీఆర్ఎస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్టే :  కాంపెల్లి శ్రీనివాస్ 

సికింద్రాబాద్, వెలుగు: బీజేపీ దేశానికి ప్రమాదకరమని సీపీఐ సికింద్రాబాద్​కార్యదర్శి కాంపెల్లి శ్రీనివాస్ విమర్శించారు. లోక్​సభ ఎన్నికల్లో సికింద్రాబాద్​లో బీజేపీని ఓడించేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప, పదేండ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని శ్రీనివాస్​విమర్శించారు. మంగళవారం లాలాపేట నఫీస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సీపీఐ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రభుత్వాలను అస్థిరపరచడం, ప్రశ్నించే గొంతులను నొక్కడం, ఈడీ, సీబీఐలను ప్రతిపక్ష నేతలపైకి ఉసుగొలుపుతూ అక్రమ అరెస్టులు చేయించడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పదిసార్లు వందే భారత రైళ్లకు జెండా ఊపడం తప్ప, సికింద్రాబాద్ కోసం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఓటేస్తే మోరీలో వేసినట్టేనన్నారు. బీఆర్ఎస్​కు అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. వచ్చే నెల 1 నుంచి ‘మోదీ హటావో.. దేశ్ కి బచావో’ నినాదంతో సికింద్రాబాద్ పార్లమెంట్​పరిధిలో ప్రచార నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీహరి, గౌరీనాగరాజ్, గువ్వల మల్లేశ్, యాకోబ్, హుస్సేన్ , రవికాంత్, దేవేందర్, వెంకట్ గౌడ్  పాల్గొన్నారు.