
రబాత్: ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. కేవలం తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశామని క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ తీరుపై ఆధారపడి ఆపరేషన్ సిందూర్ పార్ట్ 2 ఉంటుందని స్పష్టం చేశారు. పాక్ ఉగ్ర కార్యకలాపాలు అలాగే కొనసాగిస్తే ఆపరేషన్ సిందూర్ పార్ట్ 2, 3 కూడా చూడవచ్చని.. ఆ దేశానికి మరోసారి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు.
మొరాకో పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ దేశ రాజధాని రబాత్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు సరైన సమాధానం ఇచ్చామన్నారు. టెర్రర్ ఎటాక్ జరిగిన తెల్లారే భారత త్రివిధ దళాలు కౌంటర్ ఆపరేషన్ సిద్ధమయ్యాయని గుర్తు చేస్తూ భారత దళాల క్విక్ రియాక్షన్ తీరును పొగిడారు.
ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రధాని మోడీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో కేవలం అమాయకులను దారుణంగా హత్య చేసిన వారిపైన మాత్రమే దాడి చేశామని.. ఏ పౌరుడిని లేదా ఏ సైనిక స్థావరంపై దాడి చేయలేదని క్లారిటీ ఇచ్చారు. మనం తల్చుకుంటే సామాన్య పౌరులు, పాక్ ఎయిర్ బేస్‌లపై దాడి చేయగలిగేవాళ్లం.. కానీ భారత్ అలా చేయలేదని.. అది తమ విధానం కాదన్నారు. ఇండియాలో ప్రజలు ఏ మతాన్ని నమ్మినా తమకు అభ్యంతరం లేదని.. ఎందుకంటే అది వారి హక్కు అని అన్నారు.
ఎవరి పట్ల వివక్ష చూపమని.. ఇదే ఇండియాకు ఉన్న ప్రత్యేక లక్షణమన్నారు. కాగా, 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించిన విషయం తెలిసిందే. 26 మంది టూరిస్టులను విచక్షణరహితంగా కాల్చి చంపారు ఉగ్రమూకలు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి ఎక్కడికక్కడ ధ్వంసం చేసింది.