లాఠీ దెబ్బలు తాళలేక పొలాల గట్లపై పరుగులు..

లాఠీ దెబ్బలు తాళలేక పొలాల గట్లపై పరుగులు..
  • మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత
  • ముందస్తుగా 500 మంది రైతుల అరెస్టు
  • మంత్రికి గోస చెప్పుకునేందుకు వెళ్లిన వాళ్లపై దౌర్జన్యం
  • లాఠీ దెబ్బలు తాళలేక పొలాల గట్లపై పరుగులు తీసిన నిర్వాసితులు

సంగారెడ్డి, వెలుగు: నిమ్జ్​ భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్​ చేశారు. మంత్రి కేటీఆర్​ పర్యటనను అడ్డుకుంటారని గ్రామాల్లోకి వెళ్లి ముందస్తు అరెస్టులకు దిగారు. ఎక్కడివారిని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. అయినా.. తమ గోస చెప్పుకునేందుకు మంత్రి కార్యక్రమానికి కొందరు నిర్వాసితులు బయలుదేరగా వారిపై లాఠీలు ప్రయోగించారు.  నేషనల్​ఇన్వెస్ట్​ మెంట్​, మాన్యూఫ్యాక్చరింగ్​ జోన్​(నిమ్జ్​) కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం, న్యాల్​కల్ మండలాల్లోని 12 గ్రామాల్లో 12,635 ఎకరాల భూసేకరణ చేయనున్నారు.

ఇప్పటి వరకు 3,800 ఎకరాల వరకు సేకరించారు. అయితే.. మామిడ్గి, హుస్సేల్లి, హద్నూర్​, మొలకలపాడు, చాల్కి  గ్రామాల రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. నిమ్జ్​పరిధిలోని ఝరాసంగం మండలం బర్దీపూర్​ శివారులో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్​ ఫ్యాక్టరీకి భూమి పూజకు బుధవారం మంత్రి కేటీఆర్​ రావడంతో ఈ  గ్రామాల్లో  భూ నిర్వాసితులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయా గ్రామాల్లో ఒకరోజు ముందే పోలీసు బలగాలు మోహరించాయి.

కొందరు రైతులు బుధవారం మంత్రి పర్యటనను అడ్డుకునేందుకు బర్దీపూర్​కు బయలుదేరారు. మామిడ్గి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్​ చేయగా.. కొందరు పొలాల గట్ల వెంట పరుగులు తీశారు. మరికొందరు రైతులు మంత్రి ప్రోగ్రాం వద్దకు చేరుకునేందుకు ప్రయత్నం చేయగా..  పోలీసులు అరెస్టు చేశారు. మంచి పంట భూములను గుంజుకుంటే తాము ఎట్లా బతకాలని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​కు వ్యతిరేకంగా వాళ్లు నినాదాలు చేశారు.  

500 మంది అరెస్టు

పోలీసులు సుమారు 500 మంది రైతులను అరెస్టులు చేశారు. మామిడ్గి, హుస్సెల్లీ, హద్నూర్​, మొలకలపాడు, చాల్కి గ్రామాల్లో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు పోలీసులు పహారా కాశారు. అర్ధరాత్రి గ్రామాల్లో గస్తీ తిరుగుతూ భయానక  వాతావరణం సృష్టించారని ప్రజలు తెలిపారు. బుధవారం తెల్లవారు జామున నిర్వాసితుల ఇండ్లలోకి వెళ్లి బలవంతంగా అరెస్టు చేసి ఝరాసంగం, చిరాక్​పల్లి, వట్​పల్లి, అల్లాదుర్గం​ స్టేషన్లకు తరలించారు.భూములిచ్చే ప్రసక్తే లేదు
నిమ్జ్​ కోసం భూములిచ్చే ప్రసక్తేలేదు. సారవంతమైన నేలలను బలవంతంగా గుంజుకు నే ప్రయత్నం చేస్తున్నారు. నా భూమి  2.5 ఎకరాలు నిమ్జ్​ కోసం ఇయ్యాలని బలవంత పెడుతున్నారు. రెండు రోజులుగా మామిడ్గిలో పోలీసులు మోహరించి భయానక వాతావరణం తీసుకొచ్చారు. - జగన్నాథ్​రెడ్డి, మామిడ్గి 

కుటుంబాన్ని సాదుడెట్ల?

నాకున్నదే 2 ఎకరాల భూమి. దాన్ని నిమ్జ్​ కోసం గుంజుకుంటే  కుటుంబాన్ని ఎట్ల పోషించుకోవాలి? సారవంతమైన నేలల్లో పంటలు పండించుకుంటున్న మా బతుకులు ఆగం చేయొద్దు. నిమ్జ్​ కోసం బీడువారిన భూములను సేకరిస్తే బాగుంటుంది. - గోదావరి, మామిడ్గి