
సిగరెట్ తాగుతున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకోసమే.. ఇప్పటివరకూ సిగరెట్ ప్యాకెట్లపై కనిపించే హెచ్చరిక సిగరెట్లపై కూడా కనిపించనుంది. ప్రతి సిగరెట్ పై ప్రింటెడ్ వార్నింగ్ తో రానున్నాయి. ఇక్కడ కాదండోయ్.. కెనడాలో.. ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కెనడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. ప్రపంచంలో సిగరెట్లపై ప్రింటెడ్ వార్నింగ్స్ తీసుకురానున్న తొలి దేశంగా కెనడా అవతరించనుంది.
ధూమపాన ప్రియుల కోసం కెనడా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సిగరెట్ నుంచి తమ పౌరులను కాపాడేందుకు ఆ దేశం ముందడుగేసింది. అందులో భాగంగా ప్రతి సిగరెట్ పై హెచ్చరిక లేబుల్ ముద్రించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో పొగాకు మరణాలను తగ్గించేందుకు కెనడా సిగరెట్లపై ప్రత్యక్ష ఆరోగ్య హెచ్చరిక లేబుల్‌ను ప్రవేశపెట్టబోతున్నట్టు కెనడియన్ మీడియా నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ల బాక్స్‌లపై ఫొటోలతో పాటు కొంత సమాచారంతో హెచ్చరికలు మాత్రమే ఉన్నాయి. అయితే సిగరెట్ బాక్సులపై ఆ హెచ్చరికలను చూసినా స్మోకర్లు అలానే తాగేస్తున్నారు. వారిలో ఆరోగ్యంపై భయమే కాదు.. పొగతాగే అలవాట్లను మానుకున్నదే లేదు. అందుకే కెనడా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. ఇకపై ప్రతి సిగరెట్‌పై హెచ్చరికలు ప్రింటెండ్ ఉంటాయి.
స్మోకింగ్ వార్నింగ్
సిగరెట్ తాగేవాళ్లు ఆ ప్రింటెడ్ వార్నింగ్ చూసిన తర్వాత స్మోకింగ్ అలవాటు మానుకుంటారని ఆశిస్తున్నట్టు కెనడా ఆరోగ్య మంత్రి కరోలిన్ బెన్నెట్ తెలిపారు. బాక్సులపై హెచ్చరికలను ముద్రించడం ద్వారా ఆ బాక్సులను వాడి పడేస్తున్నారు. అదే తాగే సిగరెట్లపై ప్రింటెడ్ వార్నింగ్ వేస్తే.. ప్రతి పఫ్ లో విషాన్ని పీలుస్తున్నామనే విషయం వారికి తెలుస్తుంది. ఇలా ప్రతిఒక్కరికి తొందరగా ఈ మెసేజ్ చేరుతుందని, కొందరిలో కొందరైనా పొగ అలవాటు మానుకుంటారని కెనడా ప్రభుత్వం భావిస్తోంది. 2035 నాటికి దేశవ్యాప్తంగా పొగాకు వినియోగాన్ని ఐదు శాతం కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కెనడా అధికార బృందం తెలిపింది.
సిగరెట్ పై సందేశం
ధూమపానం చేయడం ద్వారా చుట్టుప్రక్కల వారికి కూడా ప్రమాదమే. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్ వల్ల లుకేమియా వస్తుంది. దీంతో శరీరం అనారోగ్య పాలవడమే కాకుండా మరణానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే కెనడాలోని ప్రతి సిగరెట్‌పై ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలలో త్వరలో కొన్ని సందేశాలు కనిపిస్తాయి. కాగా సిగరెట్ పై ప్రమాద హెచ్చరికలు ముద్రించడం ద్వారా ప్రపంచంలోనే మొదటి దేశంగా కెనడా నిలిచింది.
సంప్రదింపుల ప్రక్రియ
ఆరోగ్య హెచ్చరికలను విడిగా ప్రతి పొగాకు ఉత్పత్తిపై ముద్రించడం వల్ల ప్రజలకు సరైన సందేశం చేరడానికి సాయపడుతుంది’’ అని కెనడా ఆరోగ్య మంత్రి బెన్నెట్ చెప్పారు. శనివారం ( జూన్ 3) నుంచి ఈ ప్రతిపాదనపై సంప్రదింపుల ప్రక్రియ మొదలైంది. 2023 ద్వితీయ భాగం నుంచి కొత్త నిబంధన అమల్లోకి తీసుకురావాలన్నది కెనడా సర్కారు యోచనగా ఉంది. ‘ప్రతీ పఫ్ లో విషం’ అన్న సందేశం రాయాలన్నది ప్రస్తుత ప్రతిపాదనగా బెన్నెట్ తెలిపారు
దశలవారీగా చట్టం అమలు
పొగాకు ఉత్పత్తుల స్వరూపం, ప్యాకేజింగ్ మరియు లేబులింగ్ నిబంధనల పేరుతో ఈ నిబంధనలను తీసుకువస్తున్నారు, ఇది సిగరెట్లకు దూరంగా ఉండటానికి ప్రభుత్వం నుండి మొదటిది. 2035 నాటికి సిగరెట్ తాగే వారి సంఖ్యను 5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదే లక్ష్యాన్ని సాధించేందుకు ఈ చట్టం రూపొందించబడింది. ఈ చట్టం 2023 ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుంది. అయితే ఇది దశలవారీగా అమలు చేయబడుతుంది. పొగాకు సంబంధిత ఉత్పత్తుల ప్యాకేజీలను విక్రయించే దుకాణదారులు ఏప్రిల్ 2024 నాటికి సిగరెట్‌లపై ఈ హెచ్చరికను ముద్రించాల్సి ఉంటుంది. జులై 2024 చివరి నాటికి కింగ్ సైజ్ సిగరెట్‌లపై హెచ్చరికలను ముద్రించి.. సిగరెట్లు , ఇతర వస్తువులను విక్రయించే దుకాణదారులు ఏప్రిల్ 2025 నాటికి దీనిని అమలు చేయాల్సి ఉంటుంది.