- సమకాలీన సాహిత్యానికి సరికొత్త రూపం అందించినందుకు పురస్కారం
స్టాక్‌హోమ్: ప్రతిష్టాత్మక సాహిత్య నోబెల్ పురస్కారం కెనడాకు చెందిన ప్రముఖ రచయిత్రి, వ్యాసకర్త అన్నే కార్సన్ (76)కు లభించింది. ప్రాచీన సంప్రదాయ సాహిత్యంతో సరికొత్తదనాన్ని కొనసాగిస్తూ, సమకాలీన సాహిత్యానికి సరికొత్త రూపాలను అందించినందుకు గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది.
1950 జూన్21న టొరంటోలో జన్మించిన అన్నే కార్సన్.. యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ప్రాచీన గ్రీకు సాహిత్యంలో కోరిక వల్ల కలిగే సుఖ దుఃఖాలను విశ్లేషిస్తూ ‘ఎరోస్ ది బిట్టర్ స్వీట్’ అలాగే, పద్య రూపంలో సాగే నవల ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ రెడ్’, 2001లో కెనడా గ్రిఫిన్ కవితా పురస్కారం పొందిన ‘మెన్ ఇన్ ది ఆఫ్ అవర్స్’, హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో, గ్రీకు పురాణ పాత్ర హెలెన్‌ల కథలను పోలుస్తూ రాసిన ‘నార్మా జీన్ బేకర్ ఆఫ్ ట్రాయ్’ను ఆమె రచించారు.
పదాలపై భాషావేత్తకు ఉన్న పట్టు, కొత్త అర్థాన్ని సృష్టించాలనే కవి తపనల కలయికే కార్సన్ సాహిత్యమని సాహిత్య కమిటీ చైర్మన్ ఆండర్స్ ఓల్సన్ ప్రశంసించారు. పురస్కార ప్రకటన సమయానికి కార్సన్.. ఐస్‌లాండ్‌లో ఉన్నారని స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి ఇంగ్రిడ్ కార్ల్‌బర్గ్ తెలిపారు.
తాము ఫోన్‌లో సమాచారం అందించినప్పుడు ఆమె తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారని పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో క్లాసిక్స్ బోధించిన కార్సన్, ప్రస్తుతం తన భర్త రాబర్ట్ క్యూరీతో కలిసి ఐస్‌లాండ్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు 2022లో ఐస్‌లాండ్ పౌరసత్వం లభించింది.
