బైక్ వెనక కూర్చున్న వారికి హెల్మెట్ లేకున్నా లైసెన్స్ రద్దు

బైక్ వెనక కూర్చున్న వారికి హెల్మెట్ లేకున్నా లైసెన్స్ రద్దు

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్న వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తామని కర్ణాటక రవాణా శాఖ తెలిపింది. అంతేకాకుండా.. వాహనం వెనక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోయినా కూడా రైడర్స్ యొక్క డ్రైవింగ్ లైసెన్సులను మూడు నెలల పాటు రద్దు చేస్తామని తెలిపింది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీతో అధికారులు మంగళవారం వర్చువల్ సమావేశంలో హాజరైన తరువాత రవాణా శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోకపోతే రూ. 1000 జరిమానాగా విధించేవారు. అయితే మోటారు వాహనాల (సవరణ) చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం జరిమానాను రూ .1,000 నుంచి రూ. 500లకు తగ్గించింది. దాంతో ప్రస్తుతం కర్ణాటకలో హెల్మెట్ పెట్టుకోని వాహనదారులకు రూ .500 జరిమానా విధిస్తున్నారు.

ఈ కొత్త నిబంధనలను వెంటనే అమల్లోకి తెచ్చేందుకు రవాణా కమిషనర్ రాష్ట్రంలోని అన్ని జాయింట్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త నిబంధన ప్రకారం.. హెల్మెట్ లేకుండా పిలియన్ రైడర్ దొరికినా రైడర్‌కు జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా.. గతంలో ట్రాఫిక్ నియమాలు పాటించకుండా కేసులు, ఫైన్‌లు విధించబడ్డ వ్యక్తుల లైసెన్స్‌లు ఆరు నెలలు రద్దుచేయబడతాయి.

బెంగళూరులో హెల్మెట్‌లెస్ కేసులు ఏటేటా పెరుగుతున్నాయి. 2018లో 16.4 లక్షలు, 2019లో 20.3 లక్షలు, 2020 సెప్టెంబర్ వరకు 20.7 లక్షల కేసులు నమోదైనట్లు బెంగళూరు ట్రాఫిక్ విభాగం పేర్కొంది. సెప్టెంబర్ 13 నుంచి 19 వరకు వారం రోజుల్లో హెల్మెట్‌లెస్ రైడింగ్‌కు సంబంధించి 26,590 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఆ తర్వాత వారంలో ఈ సంఖ్య 29,925కు పెరిగింది.

రవాణశాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బెంగళూరు జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) బీఆర్ రవికాంతే గౌడ స్వాగతించారు. ఈ చర్యతో రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాల సంఖ్య తగ్గుతుందని ఆయన అన్నారు. చాలా అధ్యయనాల ప్రకారం.. హెల్మెట్లను సరైన విధంగా వాడటం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడబడతాయని తేలింది. ఐక్యరాజ్యసమితి 2016లో చేసిన అధ్యయనం ప్రకారం.. దేశంలో సరైన హెల్మెట్ వాడటం వల్ల సంవత్సరానికి కనీసం 16,000 మంది వాహనదారుల ప్రాణాలు కాపాడవచ్చని స్పష్టమైంది.

For More News..

వర్క్ ఫ్రం హోం ఆప్షన్ గడువు పెంచిన అమెజాన్

జాలర్లను భయపెట్టిన ఒంటికన్ను షార్క్.. ఫొటోలు చూస్తే మీరు కూడా భయపడాల్సిందే..

ప్లేట్ బిర్యానీ రూ. 10 ఆఫర్.. అడ్డుకొని ఫ్రీగా పంచిపెట్టిన పోలీసులు