
పెద్దపల్లి, వెలుగు: టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. గ్రూప్1 ప్రిలిమ్స్ రద్దుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. అందుకు బాధ్యులైన టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను బర్తరఫ్ చేయాలని డిమాండ్‌చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పరీక్ష రద్దుకు బాధ్యత వహించి సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత రాజీనామా చేయాలన్నారు.
ఎందరో పేద విద్యార్థులు అప్పులు చేసి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకున్నారని, 3.63 లక్షల మంది విద్యార్థుల నోట్లో కేసీఆర్మట్టికొట్టిండని ఫైర్ అయ్యారు. పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. పరీక్షకు హాజరైన వారికన్నా 270 ఆన్సర్ షీట్ లు ఎక్కువ ఎందుకు ఉన్నాయో ప్రభుత్వం జవాబుచెప్పాలన్నారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొత్త కమిషన్ ఏర్పాటు చేసేవరకు పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.