జిల్లాకో పాలియేటివ్ కేర్‌‌‌‌ టీమ్‌‌

జిల్లాకో పాలియేటివ్ కేర్‌‌‌‌ టీమ్‌‌
  • ప్రస్తుతం 8 జిల్లాలో లోకొనసాగుతున్న సేవలు
  • త్వరలోనే రాష్ట్రవ్యా ప్తంగావిస్తరణకు సర్కారు నిర్ణయం
  • నిమ్స్‌‌లో సిద్ధమైన జెరియాట్రిక్ వార్డు

హైదరాబాద్, వెలుగు:  కేన్సర్, ఎయిడ్స్​పేషెంట్లు, వృద్ధులకు అందించే పాలియేటివ్​ కేర్​సేవలను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ హెల్త్ మిషన్‌‌ నిధులతో ప్రస్తుతం 8 జిల్లాల్లో ఈ సేవలను అమలు చేస్తుండగా, మిగతా 23 జిల్లాల్లోనూ వీటిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కన్న పిల్లల ఆదరణకు నోచుకోక చాలా మంది చివరి రోజులను భారంగా గడుపుతున్నారు. తమ పనులు తాము చేసుకోలేక, కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం వల్ల అదే బాధతో కన్నుమూస్తున్నారు. కేన్సర్‌‌, ఎయిడ్స్‌‌‌‌ వంటి జబ్బులతో బాధపడుతున్నొళ్లు ఇట్లనే కాలం వెళ్లదీస్తున్నారు. వీళ్లకు ఇంట్లోనే అవసరమైన సేవలు అందించి హ్యాపీగా గడిపేందుకు కౌన్సెలింగ్‌‌ ఇస్తే ఇంకొన్ని రోజులు ఎక్కువగా బతికేందుకు అవకాశముంటుంది. దీన్నే పాలియేటివ్ కేర్ అంటారు.

ఇంటింటికీ వెళ్లి ట్రీట్​మెంట్

రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్‌‌ రూరల్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లాల్లో పాలియేటివ్‌‌ కేర్‌‌ సేవలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రతి జిల్లాకు ఓ మెడికల్​టీమ్​ఈ సేవలను అందిస్తోంది. ఈ టీమ్‌‌లో నర్స్‌‌, ఫిజియోథెరపీ టెక్నీషియన్‌‌ ఉంటారు. ఓ వాహనం, డ్రైవర్‌‌‌‌ను కేటాయించారు. ఈ టీమ్‌‌ ఆశ కార్యకర్తలు, ఏఎన్‌‌ఎంల సహకారం తీసుకుంటూ ప్రతి రోజూ 12 మంది ఇండ్లకు వెళ్లి పాలియేటివ్ కేర్ సేవలు అందించాల్సి ఉంటుంది. పేషెంట్​హ్యాపీగా ఉండేందుకు అవసరమైన మందులు, ఫిజియోథెరపీ, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేయాల్సి ఉంటుంది. కండీషన్‌‌ను బట్టి వారానికి ఒకసారి లేదా నెలకోసారి పేషెంట్ ఇంటికెళ్తుంది. ఎవరికి పాలియేటివ్ కేర్ అవసరమనేది పీహెచ్​సీల్లోని మెడికల్ ఆఫీసర్లు నిర్ణయిస్తారు.

దవాఖాన్లలో ప్రత్యేక వార్డులు

వృద్ధుల కోసం దవాఖాన్లలో ప్రత్యేక(జెరియాట్రిక్‌‌) వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శిక్షణ పొందిన నర్సులు, టెక్నీషియన్లు ఈ వార్డుల్లో సేవలందిస్తారు. నిమ్స్‌‌లో ఇప్పటికే 30 బెడ్లతో జెరియాట్రిక్‌‌ వార్డును సిద్ధం చేశారు. ఈ నెలలోనే వార్డును ప్రారంభించనున్నారు. పాలియేటివ్ కేర్ అవసరమైన వారి పరిస్థితి విషమంగా ఉంటే, సమీప దవాఖానలోని జెరియాట్రిక్ వార్డులో ఉంచి సేవలందింస్తామని ఎన్‌‌హెచ్‌‌ఎం ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జిల్లా కేంద్రాల్లో పెట్టే కేన్సర్‌‌‌‌ కేర్ సెంటర్లలో కూడా పాలియేటివ్‌‌ కేర్‌‌‌‌ సేవలను అందించే ఆలోచన చేస్తున్నామన్నారు.

నిమ్స్‌‌లో జెరియాట్రిక్‌‌ ఎండీ కోర్స్‌‌

చిన్న పిల్లల డాక్టర్లను పీడియాట్రిషన్‌‌ అన్నట్టుగానే, వృద్ధులకు ట్రీట్​మెంట్​ చేసే డాక్టర్లను జెరియాట్రిషన్స్ అంటారు. ప్రస్తుతం సౌతిండియాలో త్రివేండ్రం, చెన్నైలోని రెండు మెడికల్ కాలేజీల్లో మాత్రమే జెరియాట్రిక్ పీజీ అందుబాటులో ఉంది. నిమ్స్‌‌లో కూడా జెరియాట్రిక్ ఎండీ సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ‘ప్రస్తుతం జనరల్ ఫిజీషియన్లే జెరియాట్రిక్ ఓపీ నిర్వహిస్తున్నారు. స్పెషల్ వార్డు ప్రారంభించాక, జెరియాట్రిక్ ఎండీ సీట్ల కోసం నేషనల్ మెడికల్ కమిషన్‌‌కు ప్రతిపాదనలు పెడతాం’అని నిమ్స్ డైరెక్టర్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ మనోహర్‌‌‌‌ వెల్లడించారు. దేశంలో జెరియాట్రిషన్లు చాలా తక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో అసలే లేరు. జెరియాట్రిక్ సీట్లు రావాలంటే జెరియాట్రిక్ బోధించే ప్రొఫెసర్లు ఉండాలి. ఈ నేపథ్యంలో జెరియాట్రిక్ ప్రొఫెసర్ల కోసం జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని మనోహార్ వివరించారు.