గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఎవరో? .. బీఆర్ఎస్ లో రెండుగా చీలిన బీసీ లీడర్లు 

గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఎవరో? .. బీఆర్ఎస్ లో రెండుగా చీలిన బీసీ లీడర్లు 

సిద్దిపేట, వెలుగు:   బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ పోటీ చేయనున్న గజ్వేల్​ నియోజకవర్గంలో  బీజేపీ నుంచి  అభ్యర్థి ఎవరన్నది హాట్​ టాపిగ్​గా మారింది. కేసీఆర్​పై ఈటల రాజేందర్​ పోటీ చేస్తానని గతంలో ఆయన ప్రకటించారు. ఈ  నేపథ్యంలో గజ్వేల్​ నుంచి ఈటల పోటీ చేస్తే గెలిపించేందుకు కృషి చేస్తామని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.  ఇందులో భాగంగానే గజ్వేల్​ నుంచి ఈటలను పోటీకి దించాలని ఈటల   తరపున , ఆయన సతీమణి జమన తరపున  బీజేపీ టికెట్​కు స్థానిక లీడర్లే దరఖాస్తు  ఇచ్చారు. కేసీఆర్​కు దీటైన అభ్యర్థి ఈటలే  అంటూ , తనకే టికెట్​ కేటాయించాలని లీడర్లు హైకమాండ్​ను అభ్యర్థిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గజ్వేల్​ బీజేపీ స్థానానికి 17 మంది దరఖాస్తు చేశారు. 

 టికెట్ కోసం 17 దరఖాస్తులు

గజ్వేల్ బీజెపీ టికెట్ కోసం మొత్తం 17 దరఖాస్తులు అందాయి. స్థానిక నేతలతో పాటు మరో ముగ్గురు స్థానికేతరులు టికెట్​ కోసం అప్లయ్​ చేశారు.   స్థానిక  నేతలు   కప్పర ప్రసాద్ రావు, దారమ్ గురువా రెడ్డి, పుదారి నందన్ గౌడ్, నలగామ శ్రీనివాస్,  కూడిక్యాల రాములు,  దేవులపల్లి మనోహర్ యాదవ్, వెన్నంరాజ్ విజయ్ కుమార్ , నీమూరి ఆంజనేయులు, అల్లం సంగీత, ఉడుత మల్లేశం యాదవ్, ఈటెల రాజేంధర్, ఈటెల జమునతోపాటు మరో ఐదుగురి నుంచి అప్లికేషన్లు అందాయి.  

ఈటల తరపున స్థానిక నేతల దరఖాస్తు.. 

ఈటల రాజేందర్ కు గజ్వేల్ బీజెపీ టికెట్ కోసం స్థానిక నేతలే పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. దరఖాస్తుకు ముందే స్థానిక నేతలు ఈటలతో మాట్లాడారు. తన పోటీ సంగతి హైకమాండ్​ నిర్ణయిస్తుందని ఈటల తెలిపారు.  గజ్వేల్ టికెట్ కోసం తాము దరఖాస్తు చేస్తున్నామంటే అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది.  హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న  ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తారా లేక కుటుంబ సభ్యులనెవరినైనా బరిలోకి దించుతారా అనేది ప్రస్తుతం చర్చగా మారింది.  సీఎం కేసీఆర్ తో విభేధించి బీజెపీలో చేరిన ఈటల కుటుంబం గజ్వేల్ బరిలో ఉంటే పార్టీకి  రాష్ట్ర వ్యాప్తంగా  అనుకూలత ఏర్పడుతుందని  కార్యకర్తలు భావిస్తున్నారు. 

మెజార్టీ ఓటర్లు బీసీలే 

గజ్వేల్ నియోజకవర్గంలో మోజార్టీ ఓటర్లు బీసీలే ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2.56 లక్షల ఓటర్లుండగా దాదాపు లక్ష పై చిలుకు ఓటర్లు బీసీలు ఉన్నారు.  నియోజకరవ్గంలో ముదిరాజ్ ఓటర్లు ఎక్కువ ఉన్నారు.    గెలుపోటములను నిర్ణయించే ఓటు బ్యాంక్​గా ముదిరాజులున్నారు.  ఈ నేపథ్యంలో బీజెపీ నుంచి ఈటలను  బరిలోకి దింపితే ఫలితం ఉంటుందనే చర్చ సాగుతోంది.  

గజ్వేల్​ బీఆర్​ఎస్​లో రెండు వర్గాలు.. 

ఇదిలా ఉండగా..  గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీలో  బీసీ లీడర్లు  రెండు గ్రూపులుగా విడిపోయారు. వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  చట్ట సభల్లో బీసీలకు  తగిన ప్రాధాన్యం కల్పించాలని ఒక గ్రూపు ప్రచారం చేస్తుంటే,  పదవుల  కోసం  బీసీ నినాదాన్ని ముందుకు తెచ్చారని మరో గ్రూపు పోటీ ప్రచారాన్ని మొదలు పెట్టింది.  

బలమైన అభ్యర్థిని  పోటీలో ఉంచాలి. 

 గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై బీజెపీ తరపున బలమైన  అభ్యర్థిని నిలపాలని కోరుకుంటున్నాం.  సీఎంతో పోరాడుతున్న  బలహీన వర్గాలకు చెందిన ఈటల రాజేందర్ బరిలో నిలిస్తే బాగుంటుంది.  ఆయన తరపున  టికెట్ కోసం దరఖాస్తు చేశాం.  

బండారి మహేష్, గజ్వేల్ బీజెపీ లీడర్