బస్తీకైతే ప్యాకేజీ అపార్ట్ మెంట్ కైతే ఆఫర్​

బస్తీకైతే ప్యాకేజీ అపార్ట్ మెంట్ కైతే ఆఫర్​
  • ముందంజలో అధికార పార్టీ క్యాండిడేట్లు
  • జిమ్ ఏర్పాటు, డ్రైనేజీ పైప్ లైన్
  • వేయించేందుకు రెడీ ఓటర్లతో కాంటాక్ట్​ అయ్యే పనిలో బిజీబిజీ

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ ఎన్నికల క్యాంపెయిన్​ ఇయ్యాల్నే ఆఖరు. క్యాండిడేట్లు పోల్ మేనేజ్ మెంట్ పై ఫోకస్​ చేశారు. అధికార పార్టీ క్యాండిడేట్లు ఎక్కువగా నజరానాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బస్తీ అయితే ప్యాకేజీ, అపార్ట్​మెంట్​అయితే ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ బూత్​ల వారీగా ఓటర్ల జాబితా, ఫోన్ నంబర్లు, ఇంట్లోని ఓటర్ల సంఖ్య బట్టి వారిని కాంటాక్ట్​ అయ్యే పనిలో బిజీగా ఉన్నారు. తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నారు.  గెలుపును డిసైడ్​ చేసే ఓటర్లను ఆకట్టుకునేందుకు క్యాండిడేట్లు ఇప్పటికే తమ డివిజన్లలోని కాలనీలు, బస్తీల్లోని లెక్కలపై ప్రిపేర్ అయ్యారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్  రెబల్ క్యాండిడేట్లు కూడా ఎన్ రోల్ లిస్టులతోపాటు పోలింగ్ చిట్టీలను డోర్ టూ డోర్ పంచుతున్నారు. డివిజన్ లో బూత్ ల వారీగా ఓట్లు, కాలనీలు, అపార్టుమెంట్లు, బస్తీల్లో ఉండే ఓటర్లపై దృష్టి పెట్టారు. పోలింగ్ డే రోజున స్పెషల్ వెహికల్, ఫుడ్ తో పాటు ఓటుకింత ముట్టజెప్పేందుకు గల్లీ లీడర్లు రెడీ అయ్యారు.

100 మంది ఓటర్లు దాటితే..

అపార్టుమెంట్లలో ఓటర్లు ఎక్కువ ఉండడంతో పార్టీలు ఆఫర్ ఇస్తున్నాయి. కూకట్ పల్లి డివిజన్ లో 70 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొత్తం ఓటర్ల సంఖ్య 48వేలు.  ఇందులో 40  కేంద్రాల పరిధిలో చిన్నాపెద్దా కలిపి 426 అపార్టుమెంట్లు ఉండగా, వాటిలో 80 శాతం ఓటర్లు ఉన్నారని స్థానిక నేతలు తెలిపారు. ఒక్కో అపార్టుమెంట్ ను బట్టి ఆఫర్ చేస్తున్నారు. అపార్టుమెంట్లలో ఓటర్ల సంఖ్య 100 దాటితే ఆఫర్​కింద 2 నుంచి 3 లక్షలు, బస్తీల్లో అయితే లక్ష నుంచి లక్షన్నర వరకు ప్యాకేజీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. డివిజన్ లో ఇతర పార్టీల నుంచి పోటీ తీవ్రంగా ఉండే అధికార పార్టీ క్యాండిడేట్లు అపార్టుమెంట్ కమిటీలకు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు. యూసుఫ్ గూడలోని ఓ బూత్ పరిధిలో 200 మంది ఉండే అపార్టుమెంట్ లో పార్కింగ్ ఏరియాలో జిమ్ ఏర్పాటుకు ఆఫర్ ఇచ్చారు. విద్యానగర్ లోని ఓ అపార్టుమెంట్​లో  డ్రైనేజీ పెండింగ్​ పైపులైన్ నిర్మాణానికి అధికార పార్టీ క్యాండిడేట్ ఓకే చెప్పారు. కొన్ని కాలనీల్లో ఓపెన్ జిమ్​లనను క్యాండిడేట్లు​ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉన్నారు.

కేసీఆర్ ​సభతో షురూ

ఎల్ బీ స్టేడియంలో జరిగిన సీఎం కేసీఆర్ సభతో క్యాండిడేట్లు ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డారు.  సభకు వచ్చిన ఒక్కొక్కరికి రూ. 500 నుంచి 1000 ఇవ్వగా, రవాణా, భోజన ఖర్చులను కూడా ఇచ్చారు. నిన్న, మొన్నటివరకు రోడ్ షోలూ, డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేశారు. నేటితో ప్రచారం ముగియనుంది. అడిక్ మెట్ డివిజన్ లోని రెండు బస్తీల ఓటర్ల కోసం ఏకంగా భారీ దావత్ ను అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేశారు.