
- వెంటనే ఫలితాలు ప్రకటించాలి
- ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో నిరసన
ముషీరాబాద్, వెలుగు: హరిజంటల్ విధానం వద్దని, నోటిఫికేషన్ మేరకు వర్టికల్ ద్వారా గురుకులాల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టులో ఎగ్జామ్స్ రాస్తే.. ఇప్పటివరకు రిజల్ట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. వెంటనే గురుకుల ఫలితాలు ప్రకటించాలని కోరారు. వర్టికల్ విధానంలో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా అభ్యర్థులు సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కొందరు పురుష అభ్యర్థులు హరిజంటల్ విధానం అమలు చేయాలని కోర్టును ఆశ్రయించారని చెప్పారు. హరిజంటల్ అమలు చేస్తే మహిళా అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, నోటిఫికేషన్లో ఇచ్చిన మేరకు వర్టికల్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో అభ్యర్థులు జోత్స్న, అస్మా, దీప్తి, సుజాత, మాధురి, ప్రసన్న, ప్రియాంక, మంగమ్మ, మనోజ్ఞ, ఇందిరా, సుజాత, కవిత, సునీత తదితరులు పాల్గొన్నారు.