గంటలోపే జూబ్లీహిల్స్ ఫలితాల ట్రెండ్.. మధ్యాహ్నంలోపే ఫలితాలు పూర్తి

గంటలోపే  జూబ్లీహిల్స్  ఫలితాల ట్రెండ్.. మధ్యాహ్నంలోపే ఫలితాలు పూర్తి
  • ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ​షురూ 
  • కౌంటింగ్ కోసం 42 టేబుల్స్ ఏర్పాటు
  • రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు, పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవీఎంలు తరలించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం చుట్టూ కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటంగ్ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం 1 గంట వరకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే, కౌంటింగ్ మొదలైన గంటలోనే ట్రెండ్ తెలిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లకు 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలోనే పూర్తిస్థాయి ఫలితాలు తేలనున్నాయి. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు కౌంటింగ్‌‌‌‌లో పాల్గొంటారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌‌‌‌లో నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రారంభిస్తారు. 

ముందుగా హోం ఓట్ల లెక్కింపు.. 

ఈ ఉప ఎన్నికలో బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక్కటీ రాలేదు. దీంతో ముందుగా హోం ఓటింగ్ ఓట్లు లెక్కిస్తారని తెలుస్తోంది. హోం ఓటింగ్ కోసం 103 మంది నుంచి అప్లికేషన్లు రాగా, 101 మంది ఓటు వేశారు. ఇద్దరు చనిపోయారు. ఈవీఎంలో ముందుగా షేక్ పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ పూర్తయిన వెంటనే ఫలితాల వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తారు. మరోవైపు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. ఇందులో 1,94,631 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 99,771 మంది పురుషులు, 94,855 మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.