సికింద్రాబాద్, వెలుగు: గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 60 కిలోల గంజాయిని సికింద్రాబాద్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. యూపీకి చెందిన సైదులు(22), వెస్ట్ బెంగాల్ కు చెందిన సుమన్ సేన్ (22), ఎండీ సోహైల్ (24) విశాఖపట్నంలో బిల్డింగ్ కన్ స్ట్రక్షన్తోపాటు ఇతర కూలి పనులు చేసేవారు. వీరికి పరిచయమైన విశాఖకు చెందిన ఆకాశ్ గంజాయిని హైదరాబాద్ తీసుకెళ్లి తాను చెప్పినవారికి ఇస్తే ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తానని ఆశచూపాడు. నిందితులు ఒక్కొక్కరికి 20 కిలోల చొప్పున ప్యాకెట్లను ఇచ్చి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పంపించాడు. బుధవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగా పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఆకాశ్ పరారీలో ఉన్నాడు.
గంజాయి దందా చేస్తున్న దంపతులు
ఎల్బీనగర్: ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యాపర్తి గోపి(25), ఉమామహేశ్వరి(24) దంపతులు. వీరు వారి ప్రాంతానికి చెందిన చల్లా శివనాగరాజు వద్ద గంజాయి కొని సిటీలో అమ్ముతున్నారు. నాగోల్ జైపూరి కాలనీకి చెందిన ప్రభుచరణ్(20), ఏరుకల నగేశ్ (19) గంజాయి కోసం సంప్రదించారు. ఎల్బీనగర్లోని ఓ కార్ల షోరూమ్ వద్ద గంజాయి విక్రయించడానికి గోపి, ఉమామహేశ్వరి రాగా ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. 8 ప్యాకెట్లలో ఉన్న 930 గ్రాముల గంజాయి, బైక్ 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుచరణ్, నగేశ్‌పై సైతం కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.
కూకట్‌పల్లిలో ఎండీఎంఏ, గాంజా..
హైదరాబాద్ సిటీ: కూకట్‌పల్లిలో ఎండీఎంఎ డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న వ్యక్తిని ఎస్టీఎఫ్ టీమ్ అరెస్టు చేసింది. గాయత్రినగర్‌కు చెందిన గెడెల రుషికేశ్వర్‌రావు ఇంట్లో సోదా చేయగా 7 గ్రాముల ఎండీఎంఎ, 185 గ్రాముల గంజాయి దొరికింది. శ్రీకాకుళానికి చెందిన రుషికేశ్వర్ వ్యాపారంలో నష్టాలు రావడంతో అమ్ముతున్నాడని తేలింది.
పలువురికి రిమాండ్
మెహిదీపట్నం: మల్లేపల్లి రవీంద్ర భారతి స్కూల్ సమీపంలో గత నెల 30న 2 కిలోల హాష్ ఆయిల్‌తో పట్టుబడిన ముగ్గురిని బుధవారం హబీబ్‌నగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితులను మల్లేపల్లికి చెందిన జువెల్లరీ వ్యాపారి సయ్యద్ అబ్దుల్లా (32), ముంబైకి చెందిన అహ్మద్ షేక్ (24), ఇర్ఫాన్ షేక్ (20)గా గుర్తించినట్లు తెలిపారు. అలాగే ఆసిఫ్ నగర్ లో హాష్ ఆయిల్ అమ్ముతున్న గోవర్ధన్ (32) ను రిమాండ్ చేశారు.
ఉప్పల్: బిహార్‌కు చెందిన లోక్ నాథ్ ప్రధాన్ (19) నాచారం కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈజీమనీ కోసం బీహార్ నుంచి 2 కేజీ గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్నారు. ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు.